డబ్బులిస్తే ఫలితాలను మార్చేస్తాం! | Sting claims malpractices by opinion poll agencies | Sakshi
Sakshi News home page

డబ్బులిస్తే ఫలితాలను మార్చేస్తాం!

Published Wed, Feb 26 2014 1:34 AM | Last Updated on Sat, Sep 2 2017 4:05 AM

Sting claims malpractices by opinion poll agencies

పోల్ సర్వే ఏజెన్సీల తీరిదేనన్న న్యూస్ ఎక్స్‌ప్రెస్ చానల్
 న్యూఢిల్లీ: ఎన్నికలకు ముందు నిర్వహించే ఒపీనియన్ పోల్స్ వెనక పారదర్శకత లేదని తాము నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో తేలినట్లు న్యూస్ ఎక్స్‌ప్రెస్ టీవీ చానల్ తెలిపింది. సర్వే ఏజెన్సీలు డబ్బుల కోసం ఫలితాలను వక్రీకరించడానికి సిద్ధంగా ఉన్నాయని పేర్కొంది. ఒపీనియన్ పోల్స్ నిర్వహించిన 11 ఏజెన్సీల బండారం తమ స్టింగ్ ఆపరేషన్‌లో బట్టబయలైందని న్యూస్ ఎక్స్‌ప్రెస్ ఎడిటర్ ఇన్ చీఫ్ వినోద్ కాప్రీ మంగళవారమిక్కడ విలేకర్ల సమావేశంలో తెలిపారు.
 
 ఆపరేషన్‌లో భాగంగా ఇంకొన్ని పోల్ ఏజెన్సీలను సంప్రదించడానికి యత్నించగా అవి స్పందించలేదన్నారు. ఓటర్లను చైతన్యపరచేందుకే స్టింగ్ ఆపరేషన్ చేశామని, వివరాలను ఎన్నికల సంఘానికి అందజేస్తామని చెప్పారు. తమ విలేకర్లు పార్టీల దళారులుగా పోల్ ఏజెన్సీల అధిపతులను కలుసుకున్నారని, వారు ఎన్నికల ఫలితాలను ముడుపులను బట్టి రెండు రకాలుగా మార్చేందుకు సుముఖత వ్యక్తం చేశారని పేర్కొంది. ఎన్నికల్లో గెలుపోటముల అంచనాలో పొరపాటు శాతం(మార్జిన్ ఆఫ్ ఎర్రర్) సాధారణంగా 3గా ఉంటుందని, దీన్ని ఐదు శాతానికి పెంచగలమని సీ-ఓటర్ ఏజెన్సీకి చెందిన యశ్వంత్ దేశ్‌ముఖ్ పేర్కొన్నట్లు తెలిపింది. ఈమేరకు స్టింగ్ ఆపరేషన్‌విగా పేర్కొంటూ కొన్ని సంభాషణలను రాతపూర్వకంగా విడుదల చేసింది. అయితే ఏ సర్వేలో వాస్తవాలను కప్పిపుచ్చారో వెల్లడించలేదు.  గతంలో ఏ సర్వే ఫలితాలనైనా డబ్బుల కోసం మార్చేసినట్లు తమకు ఆధారాలు దొరకలేదని, మార్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు మాత్రమే  తెలిసిందని పేర్కొంది.
 
 సీ-ఓటర్ పోల్స్‌ను నిలిపేసిన ఇండియా టుడే
 న్యూస్ ఎక్స్‌ప్రెస్ స్టింగ్ ఆపరేషన్ నేపథ్యంలో ఇండియా టుడే గ్రూప్ తాము సీ-ఓటర్ ద్వారా చేయిస్తున్న అన్ని ఒపీనియన్ పోల్స్‌ను నిలిపివేసినట్లు తెలిపింది. సీ-ఓటర్‌పై న్యూస్ ఎక్స్‌ప్రెస్ ఆరోపణలను పరిశీలిస్తున్నామని, సీ-ఓటర్‌కు షోకాజ్ నోటీసు ఇచ్చామని వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement