యూపీ అంటేనే ఉల్టా పల్టా
ఉప ఎన్నికల ఫలితాలతో యూపీలో కమలనాధులు నిరసపడిపోయారు. రాష్ట్రంలో ఓ పార్లమెంట్ స్థానానికి,11 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కేవలం మూడంటే మూడే సీట్లు కమలనాథుల దక్కించుకున్నారు. మొత్తం 11 స్థానాలలో కమలం వికసిస్తుందని ఆ పార్టీ నేతలు అంతా ఎంతో ఆశపడ్డారు. కానీ ఆ ఆశలపై సమాజవాదీ పార్టీ (ఎస్పీ) సైకిల్ రూపంలో దూసుకువెళ్లి మరీ కమలాన్నీ ఢీ కొట్టింది. దాంతో కమలం రేకులు ఊడిపోయాయి. ఈ ఉప ఏన్నికల్లో 8 అసెంబ్లీ స్థానాలతోపాటు రాష్ట్రంలో జరిగిన ఒకే ఒక్క లోక్సభ స్థానాన్ని కూడా ఎస్పీ సైకిల్ చక్కగా ఎక్కించుకుని యమ స్పీడుగా వెళ్లి పోయింది.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలోని 71 సీట్లు కైవసం చేసుకుంది. దాంతో ప్రధానిగా నరేంద్రమోడీ ఢీల్లీ పీఠం చకచక ఎక్కెశారు. పార్టీకి అన్నీ సీట్లు రావడం కోసం ఆ రాష్ట్ర ఇన్ఛార్జ్ అమిత్ షా అపర చాణుక్యుడిలా వ్యవహారించారు. దాంతో ఆయనను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నియమించి పార్టీ రుణం తీర్చుకుంది. అయితే ఇదే తరహాలో ఉప ఎన్నికల్లో కూడా గెలుస్తామని కమలదళం భావించినట్లుంది.
అందుకే ఆ పార్టీ నాయకులు కూడా ఊహాల్లో విహారించినట్లు ఉన్నారో లేక అధికారంలో ఉండి కూడా సాధారణ ఎన్నికల్లో లోక్సభ స్థానాలు సింగిల్ డిజిట్ తెచ్చుకున్నామని కసి ఎస్పీ నాయకుల్లో పేరుకుపోయిందో ఏమో. కానీ ఉప ఎన్నికల్లో గెలిచి తీరాలని ఎస్పీలో మాత్రం కసి అంతకంతకు పెరిగింది. అందుకు తగ్గట్లుగానే ఆ పార్టీ నాయకులు వ్యవహారించారు. దాంతో ఉప ఎన్నికల్లో కమలం కళ తప్పింది. అందుకే మూడే స్థానాలను సరిపెట్టుకోవలసి వచ్చింది.
మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ అటు మెయిన్పూరీ ఇటు అజాంఘడ్ లోక్సభ స్థానాల నుంచి పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఆయన మెయిన్పూరీ స్థానానికి రాజీనామా చేశారు. దాంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆ స్థానం నుంచి బరిలో దిగిన ములాయం మేనల్లుడు తేజ్ ప్రతాప్ యాదవ్ మూడు లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అన్ని స్థానాలు గెలుచుకుని వంద రోజుల తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో కమలం వాడిపోడం ఏంటని కమలనాథులు తలలు పట్టుకుంటున్నారు. యూపీ అంటే ఉల్టా పల్టానేగా అని సరిపుచ్చుకుంటున్నారు.