వెట్టి నిర్మూలనకు కఠిన చట్టాలు
కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో వెట్టిచాకిరీ నిర్మూలనకు కేంద్రం కృషి చేస్తోందని, ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాలను మరింత కఠినతరం చేసి వాటి అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. వెట్టిచాకిరీ నిర్మూలన అంశంపై జాతీయ మానవ హక్కుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఢిల్లీలో జరిగిన రెండు రోజుల సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
వెట్టిచాకిరి బారినపడ్డ వారిని గుర్తించడానికి దేశవ్యాప్తంగా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి కార్పస్ ఫండ్ కేటాయించనున్నట్టు తెలిపారు. వెట్టిచాకిరీ నుంచి బాలలను విముక్తి చేసి 12వ తరగతి వరకు విద్యనందించి ఉపాధి కల్పనకు శిక్షణ ఇవ్వనున్నట్టు వెల్లడించారు. వెట్టిచాకిరీ కింద విముక్తి పొందిన అనాథ పిల్లలు, మహిళలు, వికలాంగులకు తక్షణ ఆర్థిక సాయం చేయడానికి జిల్లా మేజిస్ట్రేట్‌లకు పూర్తి బాధ్యతలు అప్పగించినట్టు తెలిపారు. విముక్తి పొందిన ఒంటరి మహిళల వివాహ బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందన్నారు.
వంశీ కుటుంబాన్ని ఆదుకోండి..
కాలిఫోర్నియాలోని మిల్‌పిటాస్‌లో నల్లజాతీయుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన వంశీరెడ్డి కుటుంబసభ్యులను ఆదుకోవాలని, వంశీరెడ్డి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించడానికి చర్యలు తీసుకోవాలని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ను కలసి దత్తాత్రేయ విజ్ఞప్తి చేశారు.
చట్టం తన పని తాను చేసుకుపోతుంది..
అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ దోషిగా తేలడం వెనుక బీజేపీ పాత్ర ఏమీ లేదని, ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతోందని దత్తాత్రేయ అన్నారు. శశికళను దోషిగా తేల్చడం వెనుక బీజేపీ హస్తం ఉందన్న ఆరోపణలను కొట్టిపారేశారు.
ఉపాధి కూలీలకు వేసవి అలవెన్స్ : అదనంగా 30 శాతం భత్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధిహామీ పథకం కింద పనులు చేస్తున్న కూలీలకు వేసవి అలవెన్స్‌ను ప్రకటిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఎండ వేడిమికి కూలీలలో పనిచేసే సామర్థ్యం తగ్గనున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉపాధిహామీ కూలీలకు రోజువారీ అందుతున్న వేతనానికి ఇకపై అదనంగా 20 నుంచి 30 శాతం వేసవి భత్యం అందనుంది. ఫిబ్రవరి 1 నుంచి జూన్ 30 వరకు వేసవి భత్యం ఉత్తర్వులు వర్తించనున్నాయి. ఫిబ్రవరిలో 20 శాతం, మార్చిలో 25 శాతం, ఏప్రిల్, మే నెలల్లో 30 శాతం, జూన్‌లో 20 శాతం చొప్పున వేసవి అలవెన్స్‌ను అందించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు తగిన సూచనలివ్వాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.