సీమాంధ్రలో.. విభజనాగ్ని
కేంద్ర నిర్ణయంపై సీమాంధ్రలో మిన్నంటిన ఆగ్రహజ్వాలలు
హోరెత్తిన రాస్తారోకోలు, హైవేల దిగ్బంధాలు
కానరాని కాంగ్రెస్ టీడీపీ నామమాత్రపు నిరసనలు
వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో బంద్ సంపూర్ణం
సాక్షి నెట్‌వర్క్: రాష్ట్ర విభజన నిర్ణయానికి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేయడంపై సీమాంధ్ర జిల్లాల్లో ఆందోళనలు మిన్నంటాయి. దీనిని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, అధికార కాంగ్రెస్, సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం సీమాంధ్ర జిల్లాల్లో బంద్ సంపూర్ణంగా జరిగింది. షాపులు, విద్యాసంస్థలు, బ్యాంకులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. ఎక్కడికక్కడ ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా, హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే దిష్టిబొమ్మల దహనాలు పెద్దఎత్తున జరిగాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుమేరకు పార్టీ శ్రేణులు బంద్‌ను విజయవంతం చేయగా వీరికి సమైక్యవాదులు, ఎన్జీవోలు సంఘీభావం పలికారు. బంద్‌కు పిలుపునిచ్చిన తెదేపా శ్రేణులు నామమాత్రపు ఆందోళనలు నిర్వహించగా, కాంగ్రెస్ శ్రేణులు అసలెక్కడా కానరాలేదు.
‘అనంత’లో పోలీసుల ఓవరాక్షన్.. స్పృహతప్పిన జేఏసీ నేతలు
అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాల చుట్టూ పోలీసులు వలయంలా ఏర్పడి హాస్టల్ విద్యార్థులను కట్టడి చేశారు. ఎస్కేయూ విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది నగరంలోకి రావడానికి ప్రయత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. తోపులాటలో ముగ్గురు జేఏసీ నాయకులు స్పృహతప్పి కింద పడిపోయారు. చిత్తూరు జిల్లా వడమాలపేటలో వైఎస్సార్ సీపీ నేత రోజా, తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, మదనపల్లెలో ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ, మానవహారం నిర్వహించారు. వైఎస్సార్ జిల్లాలో ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ శ్రేణులు, సమైక్యవాదులు రాస్తారోకోలు చేపట్టారు. వైఎస్సార్ సీపీ నేత ఎస్వీ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. కలెక్టరేట్‌లో పాలన స్తంభించింది.
విశాఖలో కోర్టుకు తాళాలు
విశాఖ నగరంలో న్యాయవాదులు కోర్టుకు తాళాలు వేశారు. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో గురుద్వార కూడలిలో జాతీయ రహదారిని దిగ్బంధిం చారు. కేంద్రం వెనక్కి తగ్గకుంటే విద్యుత్ జేఏసీ మెరుపు సమ్మెకు సిద్ధమని విద్యుత్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ పోలాకి శ్రీనివాసరావు హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో పిల్లి సుభాష్‌చంద్రబోస్, జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూ, రాజమండ్రిలో జక్కంపూడి విజయలక్ష్మి, అమలాపురంలో ఎమ్మెల్యే గొల్ల బాబూరావులు బంద్ ను పర్యవేక్షించారు. కాకినాడలో తాజా మాజీ ఎమ్మె ల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి బైక్ ర్యాలీ నిర్వహిం చారు. కొత్తపేట వద్ద వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ర్ట అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి హైవేని దిగ్బంధించారు. పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి సమీపంలోని తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో వైఎ స్సార్‌సీపీ నాయకులు బైఠాయిం చారు. చింతలపూడిలో టీడీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో వైఎస్సార్ సీపీ ఉత్తరాం ధ్ర జిల్లాల సమన్వయకర్త ఆర్‌వీ సుజయ్‌కృష్ణ రంగారావు బంద్ నిర్వహించారు. శ్రీకాకుళం నియోజకవర్గ సమన్వయకర్త వరుదు కల్యాణి బంద్ నిర్వహించారు.
‘కృష్ణా’లో సోనియా దిష్టిబొమ్మల దహనాలు
కృష్ణాజిల్లా వ్యాప్తంగా ఏఐసీసీ అధినేత సోనియా, హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే దిష్టిబొమ్మలు దహనాలు హోరెత్తాయి. విజయవాడలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త వంగవీటి రాధాకృష్ణను పోలీసులు అరెస్టు చేశారు. షేర్‌మహ్మద్‌పేట వద్ద వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను రహదారిని దిగ్బంధించారు.
గుంటూరు జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ ఎం.గోపీనాయక్ స్వచ్ఛందంగా విధులు బహిష్కరించారు. గుంటూరులో వైఎస్సార్ సీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించాయి. ప్రభుత్వశాఖల ఉద్యోగులు విధులు బహిష్కరించారు. ప్రకాశం జిల్లాలో సోనియా, సీమాంధ్ర మంత్రుల దిష్టిబొమ్మలు దహనం చేశారు. దొనకొండలో మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి బంద్ నిర్వహించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తడలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించి సోనియాగాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కోవూరులో ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, ఉదయగిరి, వింజమూరు, దుత్తలూరులో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో బంద్ జరిగింది. నెల్లూరులో విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో జరిగింది. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ జరిగింది.
కాంగ్రెస్ నేతలపై జనాగ్రహం
కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పితాని సత్యనారాయణను, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో, తణుకులో ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరావును, పాలకొల్లులో ఎమ్మెల్యే బంగారు ఉషారాణిని సమైక్యవాదులు అడ్డుకున్నారు. గుంటూరులో ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇంటిని ముట్టడించారు. కాగా, రాష్ట్ర విభజనకు కేబినెట్ ఆమోదముద్ర వేయడాన్ని తట్టుకోలేక గుంటూరు జిల్లాలో ఒకరు, కృష్ణాజిల్లాలో ఒకరు మృతిచెందారు.