'నా దుస్తులిప్పి.. బ్లాక్మెయిల్ చేశారు'
దేశ విదేశాల్లో బ్రహ్మాండమైన పేరుప్రఖ్యాతులున్న విశ్వభారతి విశ్వవిద్యాలయంపై తొలిసారి ఓ మచ్చపడింది. పశ్చిమబెంగాల్లోని శాంతినికేతన్లో గల ఈ వర్సిటీలో ముగ్గురు సీనియర్ విద్యార్థులు తన దుస్తులు విప్పి, ఫొటోలు తీశారని, డబ్బులు ఇవ్వకపోతే వాటిని ఇంటర్నెట్లో పెడతామంటూ బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఓ ఫస్టియర్ విద్యార్థిని ఆరోపించింది. ఆమె యూనివర్సిటీని వదిలి వెళ్లిపోయింది. మళ్లీ ఎప్పుడు వస్తుందన్న విషయం కూడా తెలియట్లేదు.
ఈ విషయమై ఆమె యూనివర్సిటీలో ఉన్న లైంగిక వేధింపుల కమిటీకి ఫిర్యాదుచేసింది. తనను వాళ్లు రూ. 4వేలు చెల్లించాలని బెదిరిస్తున్నట్లు ఆ ఫిర్యాదులో తెలిపింది. ఆ ముగ్గురు యువకుల్లో ఇద్దరు రెండో సంవత్సరం చదువుతున్నారని, ఒకరు మూడో సంవత్సరంలో ఉన్నారని ఆమె తెలిపింది. ఆ ముగ్గురూ కూడా ప్రస్తుతం పరారీలో ఉన్నారు. అయితే వాళ్లపై ఆమె గానీ, ఆమె తండ్రి గానీ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఈ సంఘటన ఆగస్టు 8వ తేదీన జరిగిందని అంటున్నారు. అయితే, ఆమె మాత్రం తన తండ్రి వచ్చిన ఒకరోజు తర్వాత.. అంటే 26వ తేదీన ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులకు ఫిర్యాదు చేయొద్దని యూనివర్సిటీ వర్గాలు తనకు చెప్పినట్లు ఆమె తెలిపింది. యూనివర్సిటీ వర్గాలు తమను తీవ్రంగా అవమానించాయని, ఆమెకు దుస్తులు కొనివ్వాలంటూ డబ్బు ఇవ్వజూపాయని ఆమె తండ్రి ఆరోపించారు.