
ఆవును చంపితే ఉరిశిక్ష
రాజ్యసభలో స్వామి ప్రైవేటు బిల్లు
న్యూఢిల్లీ: ఆవును చంపితే ఉరిశిక్ష విధించాలని ప్రతిపాదిస్తూ రూపొందించిన ప్రైవేటు బిల్లును బీజేపీ సభ్యుడు, సుబ్రహ్మణ్యస్వామి శుక్రవారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. జాతిపిత మహాత్మాగాంధీ ఆశించిన గోవధపై నిషేధం కోసం ఉద్దేశించిన గోరక్షణ బిల్లు–2017ను స్వామి ప్రవేశపెట్టారు. గోసంతతి పరిరక్షణకు కమిటీని నియమించాలన్నారు. ఇందులో పశుసంవర్థక, వ్యవసాయం, ఆర్థిక, పశుసంక్షేమ, పురాతన భారతీయ చరిత్ర, సంస్కృతి రంగాలకు చెందిన నిపుణులను నియమించాలని విన్నవించారు.
రూ.5వేలు, రూ.10వేల నోట్లు తీసుకురాం
రూ.5వేలు, రూ.10వేల నోట్లు తీసుకొచ్చే ప్రణాళికలేమీ లేవని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ విషయమై రిజర్వు బ్యాంకును సంప్రదించామని.. రూ.5వేల, రూ.10వేల నోట్లను తీసుకురాలేమని ఆర్‌బీఐ తెలిపిందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ లోక్‌సభలో రాతపూర్వక సమాధానం ఇచ్చారు.
బినామీ చట్టం కింద 140 మందికి నోటీసులు
నిషేధిత బినామీ ఆస్తిలావాదేవీల చట్టం కింద 140 మందికి నోటీసులు పంపినట్టు కేంద్రం శుక్రవారం లోక్‌సభ దృష్టికి తీసుకొచ్చింది. రూ. 200 కోట్ల విలువైన బినామీ లావాదేవీలు జరిగాయని, ఇందులో 124 మందికి చెందిన ఆస్తులను జప్తు చేసుకున్నామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి సంతోశ్‌కుమార్ గంగ్వార్ లిఖితపూర్వకంగా తెలియజేశారు. జప్తు చేసుకున్న వాటిల్లో స్థిర, చరాస్తులు ఉన్నాయని ఆయన వివరించారు.
రూ. 45, 622 కోట్ల నల్లధనం వెలికితీత
ఈ జనవరితోపాటు గడచిన మూడు ఆర్థిక సంవత్సరాల వ్యవధిలో నిర్వహించిన సోదాల ద్వారా రూ. 45. 622 కోట్లు విలువైన లెక్కల్లో చూపని ఆదాయాన్ని ఆదాయపన్ను శాఖ వెలికితీసింది. 2,534 వ్యక్తులపై జరిపిన దాడిలో ఈ మొత్తం బయటపడిందని గంగ్వార్ లోక్‌సభకు లిఖితపూర్వకంగా తెలియజేశారు.