
రేషన్ చక్కెర బంద్
- వచ్చే నెల నుంచి...
- సబ్సిడీ ఆపేసిన కేంద్రం..చేతులెత్తేసిన రాష్ట్రం
సాక్షి, హైదరాబాద్: నూతన తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ తర్వాత పేద, దిగువ మధ్యతరగతి ప్రజలకు చక్కెర చేదెక్కనుంది. రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తు న్న చక్కెరను ఏప్రిల్ నుంచి నిలిపి వేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ నిర్ణయించింది. చక్కెరపై ఇచ్చే సబ్సి డీని ఎత్తి వేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం గత నెలలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రకటించింది. ఏప్రిల్ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం సైతం చేతులె త్తేసింది.
రాష్ట్రంలోనూ సబ్సిడీ చక్కెర నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న రేషన్ కార్డుదారులకు అంత్యోదయ అన్న యోజన కింద ప్రతి నెలా అరకిలో చక్కెరను పౌర సరఫరాల విభాగం పంపిణీ చేస్తోంది. రేషన్ షాపుల్లో కిలోకు రూ.13.50 చొప్పున రాయితీపై అందజేస్తుంది. ఏఏవై కార్డులున్న దాదాపు 5.54 లక్షల కుటుంబాలకు ప్రతి నెలా రేషన్ చక్కెర పంపిణీ చేస్తున్నట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రతినెలా 4,500 మెట్రిక్ టన్నుల చక్కెరను సివిల్ సప్త్లస్ కార్పొరేషన్ కొనుగోలు చేస్తోంది. కేంద్రం ఇచ్చే సబ్సిడీకి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం చక్కెర కొనుగోలుకు రూ.143 కోట్లు ఖర్చు చేస్తోంది.
కేంద్రం ఇచ్చే సబ్సిడీ నిలిచిపోతే రాష్ట్ర ప్రభుత్వంపై ఈ భారం అంతకంతకూ పెరిగిపోతుంది. బహిరంగ మార్కెట్లో కిలో చక్కెర రూ.40 నుంచి రూ.43 ధరలో లభ్యమవుతోంది. ఈ లెక్కన సబ్సిడీ చక్కెర కొనుగోలు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఏటా కనీసం రూ.235 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇప్పటికే రేషన్ బియ్యం సబ్సిడీ భారం ప్రభుత్వానికి తడిసి మోపెడవుతోంది. ఏటా దాదాపు రూ.2,500 కోట్లకుపైగా భారం పడుతోంది. అందుకే సబ్సిడీ చక్కెరకు మంగళం పాడి.. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్నే రాష్ట్రంలోనూ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.