అబూజా: నైజీరియా మైదుగురి పట్టణంలోని మసీదులో శనివారం ఆత్మహాతి దాడి జరిగింది. ఈ దాడిలో 25 మంది మరణించారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారని స్థానిక మీడియా ఆదివారం వెల్లడించింది. క్షతగాత్రులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపింది. ఆత్మాహుతి దాడికి యత్నించిన వ్యక్తి మసీదులోకి ప్రవేశించి... తనను తాను పేల్చివేసుకున్నాడని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారని చెప్పింది. మసీదులో ప్రార్థన ప్రారంభమైన కొద్ది నిమిషాలకే ఈ ఘటన చోటు చేసుకుందని వారు వివరించారని పేర్కొంది.
సంఘటన స్థలంలో 25 మందికిపైగా మృతదేహాలు వెలికితీసినట్లు సహాయక చర్యల్లో పాల్గొన్నవారు తెలిపారని చెప్పింది. అయితే ఈ ఘటనలో ఎంతమంది గాయపడ్డారు అనే విషయాన్ని వెల్లడించేందుకు ఉన్నతాధికారులు నిరాకరించారని మీడియా వెల్లడించింది. గత కొద్ది సంవత్సరాలుగా ఈశాన్య నైజీరియాలో బోకో హరామ్ తీవ్రవాదులు విధ్వంసం సృష్టిస్తున్నారు. ఈ విధ్వంసంలో వేలాది మంది మరణించిన సంగతి తెలిసిందే.