ఎస్‌బీఐను దాటేసిన సన్‌ఫార్మా
మార్కెట్ క్యాప్‌లో ఎనిమిదో స్థానానికి
ముంబై: మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) సన్ ఫార్మా కంపెనీ దాటేసింది. సన్ ఫార్మా షేర్ మంగళవారం ఎన్‌ఎస్‌ఈలో 1 శాతం లాభపడి 1,040 వద్ద ముగియడంతో ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ.2,15,333 కోట్లకు పెరిగింది. ఎస్‌బీఐ మార్కెట్ క్యాప్ రూ.2,11,131 కోట్లకు చేరింది. టాప్‌టెన్ మార్కెట్ క్యాప్ కంపెనీల్లో సన్ ఫార్మా 8 వస్థానాన్ని సాధించింది. ఎస్‌బీఐ తొమ్మిదవ స్థానానికి పడిపోయింది. కాగా అధిక మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీగా రూ.5,04,069 కోట్లతో టీసీఎస్ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, ఓఎన్‌జీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, కోల్ ఇండియా, సన్ ఫార్మా, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీలు నిలిచాయి. కంపెనీ షేర్ ధరను ఆ కంపెనీ షేర్ల సంఖ్యతో గుణిస్తే, మార్కెట్ క్యాపిటలైజేషన్ వస్తుంది, షేర్ ధరలో మార్పు వల్ల ఈ విలువ ప్రతి రోజూ మారుతూ ఉంటుంది.