ఐపీఎల్- ప్లేఆఫ్స్: సన్‌రైజర్స్‌కు ఎదురుదెబ్బ
- గాయంతో నెహ్రా ఔట్.. యూవీ ఫిట్‌నెస్‌పై డౌట్స్
- హైదరాబాదీ స్పీడ్‌స్టర్ సిరాజ్‌పైనే అదనపు భారం..
బెంగళూరు: ప్లేఆఫ్స్ ముంగిట ఐపీఎల్ డిఫెండింగ్ చాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఎదురు‘దెబ్బ’! పేస్ విభాగానికి నేతృత్వం వహిస్తోన్న వెటరన్ బౌలర్ ఆశిశ్ నెహ్రా ఇకపై జట్టుకు దూరం కానున్నాడు. అటు, ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఫిట్‌నెస్‌పైనా అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎస్‌ఆర్‌హెచ్ హెడ్ కోచ్ టామ్ మూడీ మంగళవారం బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ.. నెహ్రా నిష్క్రమణను అధికారికంగా ప్రకటించారు. ప్లేఆఫ్ బెర్త్ కోసం గుజరాత్ లయన్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లోనూ నెహ్రా స్టాండ్స్‌కే పరిమితమైన సంగతి తెలిసిందే.
తప్పక గెలవాల్సిన ఆ మ్యాచ్‌లో హైదరాబాదీ స్పీడ్‌స్టర్ మొహమ్మద్ సిరాజ్ సత్తా చాటడం, ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అందుకున్న సంగతి తెలిసిందే. నెహ్రా గైర్హాజరీతో సన్‌రైజర్స్ ఆడబోయే అన్ని ప్లేఆఫ్ మ్యాచ్‌లలో సిరాజ్‌కు స్థానం ఖాయమైనట్లే. అయితే ఈ యువ బౌలర్ అదనపు భారాన్ని సునాయాసంగా మోయగడా? లేదా? లైవ్‌లో చూడాల్సిందే!
నేడు యూవీకి పరీక్షలు
ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ సందర్భంగా యువీ చిటికెన వేలికి తీవ్రగాయం కావడం, దాంతో గుజరాత్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో అతను ఆడలేకపోవడం తెలిసిందే. బుధవారం యువీ ఫిట్‌నెస్ పరీక్షల్ని ఎదుర్కొంటాడని, ఫిట్‌గా ఉన్నట్లు తేలితే తుది జట్టులో ఖచ్చితంగా ఆడతాడని కోచ్ టామ్ మూడీ చెప్పారు. ప్లే ఆఫ్స్‌లో భాగంగా హైదరాబాద్ జట్టు.. 17న(బుధవారం) బెంగళూరు వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది.