20 ఓవర్ల మ్యాచ్ జరగకపోవడం వల్లే..
బెంగళూరు:కోల్ కతా నైట్ రైడర్స్ తో బుధవారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో తమ జట్టు ఓటమికి ప్రధాన కారణం ఆట పూర్తిగా జరగకపోవడమేనని సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురళీధరన్ అభిప్రాయపడ్డాడు. వర్షం రాకతో మ్యాచ్ పూర్తిగా సాధ్యం కాలేదని, ఒకవేళ ఆట మొత్తం జరిగిన పక్షంలో సన్ రైజర్స్ విజయం సాధించే అవకాశం ఉండేదన్నాడు. కచ్చితంగా 20 ఓవర్ల పాటు ప్రత్యర్థి జట్టు ఆడుంటే అది తమకు లాభించేదన్నాడు.
' ఈ సీజన్ లో బెంగళూరు పిచ్ ను చూడండి. అక్కడ నమోదైనవన్నీ తక్కువ స్కోర్లే. అక్కడ యావరేజ్ స్కోరు దాదాపు 140 గా ఉంది. మేము ముందుగా బ్యాటింగ్ చేసి 128 పరుగులు చేశాం. కానీ మరో 10 పరుగులు చేసి ఉండాల్సింది. మ్యాచ్ పూర్తిగా జరిగి ఉంటే మేము చేసిన పరుగుల్ని కచ్చితంగా కాపాడుకునే వాళ్లం. మా ఇన్నింగ్స్ ముగిసిన తరువాత వర్షం పడటం, మ్యాచ్ ఫలితాన్ని ఆరు ఓవర్లకు కుదించటం మా అవకాశాల్ని దెబ్బతీసింది. ఓవరాల్ గా చూస్తే మ్యాచ్ పూర్తిగా జరిగి ఉంటే ఫలితం వేరుగా ఉండేది'అని మురళీధరన్ పేర్కొన్నాడు. నిన్న జరిగిన మ్యాచ్ లో వర్షం పడటం వల్ల కేకేఆర్ విజయలక్ష్యాన్ని 48 పరుగులకు నిర్దేశించారు. ఆ లక్ష్యాన్ని కోల్ కతా 5.2 ఓవర్లలోమూడు వికెట్లు కోల్పోయి ఛేదించి క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది. శుక్రవారం జరిగే క్వాలిఫయర్-2లో ముంబై ఇండియన్స్ తో కేకేఆర్ తలపడనుంది.