సన్ రైజర్స్ కు సాధారణ లక్ష్యం
కోల్ కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా శనివారం ఇక్కడ ఈడెన్ గార్డెన్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ 173 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్ కతా ఆదిలో తడబడింది. ఓపెనర్లు సునీల్ నరైన్(6), గౌతం గంభీర్(15) వికెట్లను తొందరగా చేజార్చుకుంది. తద్వారా ఈ ఐపీఎల్లో కోల్ కతా ఇప్పటివరకూ ఆడిన మ్యాచ్ ల పవర్ ప్లేలో అత్యల్ప స్కోరును నమోదు చేసింది. కోల్ కతా ఓపెనర్లు విఫలం కావడంతో ఆ జట్టు పవర్ ప్లేలో చేసిన స్కోరు 40/2. ఇది ఆ జట్టు అత్యల్ప స్కోరుగా నమోదైంది.
కాగా, టాపార్డర్ ఆటగాళ్లలో రాబిన్ ఊతప్ప(68;39 బంతుల్లో 5 ఫోర్లు 4 సిక్సర్లు), మనీష్ పాండే(46;35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు)లు ఆకట్టుకున్నారు. మరొకవైపు యూసఫ్ పఠాన్(21;15 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) ఫర్వాలేదనిపించడంతో కోల్ కతా నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. కేకేఆర్ మిగతా ఆటగాళ్లలో సూర్యకుమార్ యాదవ్(4), గ్రాండ్ హోమ్(0)లు తీవ్రంగా నిరాశపరిచారు. సన్ రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్లు సాధించగా, నెహ్రా, రషిద్ ఖాన్, కట్టింగ్లకు తలో వికెట్ లభించింది.