
Photo Courtesy: BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా కేకేఆర్‌తో ఇవాళ (ఏప్రిల్ 2) జరుగబోయే మ్యాచ్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ షాక్ తగిలినట్లు తెలుస్తుంది. ఆ జట్టు నయా సిక్స్ హిట్టింగ్ మెషీన్ అనికేత్ వర్మ నిన్న ప్రాక్టీస్ సందర్భంగా గాయపడ్డాడని సమాచారం.
నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా.. ఓ బౌలర్ వేసిన బంతి అనికేత్ కాలి బొటన వేలుకు బలంగా తాకిందని తెలుస్తుంది. నొప్పితో విలవిలలాడిపోయిన అనికేత్ పిచ్‌పై కుప్పకూలాడని ప్రచారం జరుగుతుంది. ప్రాక్టీస్ సాగుతుండగా అనికేత్ మైదానాన్ని వీడుతున్న దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. అనికేత్ గాయం విషయమై సన్‌రైజర్స్ యాజమాన్యం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
కాగా, ప్రస్తుత సీజన్‌తోనే ఐపీఎల్ అరంగేట్రం చేసిన 23 ఏళ్ల అనికేత్.. తొలి మ్యాచ్ నుంచే మెప్పిస్తూ వచ్చాడు. ఐపీఎల్ కెరీర్‌లో ఎదుర్కొన్న తొలి బంతినే (రాజస్థాన్ రాయల్స్‌పై) సిక్సర్‌గా మలిచిన అనికేత్.. అతి తక్కువ వ్యవధిలోనే భారీ హిట్టర్‌గా పేరు గడించాడు.
తన రెండో మ్యాచ్‌లో లక్నోపై 5 భారీ సిక్సర్లు బాదిన అనికేత్.. ఆతర్వాత ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో మరింత చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో సహచర బ్యాటర్లంతా విఫలం కాగా.. అనికేత్ ఒంటరి పోరాటం చేసి మెరుపు అర్ద సెంచరీ (41 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 74 పరుగులు) చేశాడు. 3 మ్యాచ్‌ల్లోనే 12 భారీ సిక్సర్లు బాదిన అనికేత్ నేడు కేకేఆర్‌తో జరిగే మ్యాచ్‌కు దూరమైతే సన్‌రైజర్స్‌కు ఇబ్బందులు తప్పవు.
కాగా, ఈ సీజన్‌లో అంతంతమాత్రంగా కనిపిస్తున్న సన్‌రైజర్స్, కేకేఆర్ గత సీజన్ ఫైనల్లో చివరిసారిగా తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో కేకేఆర్ సన్‌రైజర్స్‌ను ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్, కేకేఆర్ ఇప్పటివరకు 28 మ్యాచ్‌ల్లో తలపడగా.. కేకేఆర్ 18, సన్‌రైజర్స్ 9 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. ఓ మ్యాచ్ టైగా ముగిసింది.
ఈ సీజన్‌లో ఇరు జట్లు ఇప్పటివరకు తలో మూడు మ్యాచ్‌లు ఆడి ఒక్కో మ్యాచ్‌లో మాత్రమే గెలుపొందాయి. సన్‌రైజర్స్ తమ తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించి.. ఆతర్వాత వరుసగా లక్నో, ఢిల్లీ క్యాపిటల్స్ చేతుల్లో ఓడింది. కేకేఆర్ విషయానికొస్తే.. డిఫెండింగ్ ఛాంపియన్ హెదాలో బరిలోకి దిగిన ఈ జట్టు సీజన్ తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో చిత్తై, ఆతర్వాతి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై గెలుపొందింది. చివరిగా ముంబైతో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ మరో ఓటమిని మూటగట్టుకుంది.
ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ కేకేఆర్ కంటే పటిష్టంగా కనిపిస్తున్నప్పటికీ.. భారీ హైప్ కారణంగా అంచనాలను అందుకోలేకపోతుంది. కేకేఆర్ విషయానికొస్తే.. ఈ జట్టులో స్టార్ ఆటగాళ్లు ఉన్నా ఫామ్ లేమితో సతమతమవుతున్నారు.