ఈవీఎంలో రిజెక్ట్ బటన్ పెట్టాల్సిందే: సుప్రీం
న్యూఢిల్లీ : ఎన్నికల సంస్కరణలకు సంబంధించి సుప్రీంకోర్టు శుక్రవారం సంచలన తీర్పునిచ్చింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను తిరస్కరించే హక్కు ఓటర్లకు ఉందని అత్యున్నత న్యాయస్థానం ప్రకటించింది. ఈ మేరకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో మార్పులు చేయాలని ఎన్నికల సంఘానికి సూచించింది.
తిరస్కరణకు సంబంధించిన 'ఎవరూ వద్దు' అనే బటన్‌ను ఈవీఎంలలో ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ప్రతికూల ఓటింగ్ ఉండటం ద్వారా ఎన్నికల్లో స్వచ్ఛత, జాగురూకత పెరుగుతుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. తిరస్కరణ హక్కు ఓటర్లకు కల్పించడం ద్వారా ఎన్నికల విధానంలో మార్పు రావడమే కాదు... రాజకీయ పార్టీలు స్వచ్ఛమైన అభ్యర్థులను పోటీలో నిలబెట్టేందుకు వీలు కలుగుతుందని సుప్రీంకోర్టు సూచించింది.