గోప్యత పరిరక్షణ ఓ విఫల యుద్ధం | Supreme Court reserves verdict on right to privacy | Sakshi
Sakshi News home page

గోప్యత పరిరక్షణ ఓ విఫల యుద్ధం

Published Thu, Aug 3 2017 5:28 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

గోప్యత పరిరక్షణ ఓ విఫల యుద్ధం - Sakshi

గోప్యత పరిరక్షణ ఓ విఫల యుద్ధం

న్యూఢిల్లీ: వ్యక్తిగత సమాచారం దుర్వినియో గం అవుతుండటం పట్ల సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. నేటి సాంకేతిక యుగంలో గోప్యత అనే భావనను పరిరక్షించడం కష్టసాధ్యమవుతోందని పేర్కొంది. గోప్యత పరిరక్షణ ఒక విఫల యుద్ధమని అభివర్ణించింది. గోప్యత హక్కును ప్రాథమిక హక్కుల జాబితాలో చేర్చాలా? లేదా? అన్న అంశంపై మూడు వారాలు విచారణ జరిపిన సర్వోన్నత ధర్మాసనం బుధవారం తన తీర్పును రిజర్వులో ఉంచింది.

ఈ బెంచ్‌కు నేతృత్వం వహించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేఎస్‌ ఖేహర్‌ పదవీ విరమణ చేయనున్న ఆగస్టు 27న లేదా అంతకు ముందు తీర్పును ప్రకటించొచ్చు. మన జీవితం ప్రతి అంగుళంలోకి చొచ్చుకొచ్చిన సాంకేతికత కారణంగా గోప్యత అనే భావన ప్రాభవం కోల్పోతోందని, గోప్యత మౌలిక లక్షణాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని బెంచ్‌ అభిప్రాయపడింది. ‘ప్రైవసీ పరిరక్షణ అనే విఫల యుద్ధాన్ని చేస్తున్నాం. వ్యక్తిగత సమాచారాన్ని వేటికి వాడుతున్నారో తెలియడం లేదు.

 ఇది ఆందోళన కలిగించే విషయం’ అని వ్యాఖ్యానించింది. భారత్‌లో ప్రైవసీ పదాన్ని నిర్వచించాల్సిన అవసరం ఉందని, సుమారు 140 కోట్ల మంది సమాచారం ప్రజాక్షేత్రంలో ఉందని బెంచ్‌ పేర్కొంది. గోప్యత హక్కును ప్రాథమిక హక్కుగా గుర్తించినట్లయితే , దాని కిందికి ఏమేం వస్తాయో కూడా తామే చెప్పాల్సి ఉందని వెల్లడించింది.

‘గోప్యత హక్కు’ కింద వద్దు: కనీస వ్యక్తిగత విషయాలు వెల్లడించడాన్ని గోప్యత హక్కు కింద పరిగణించరాదని గుజరాత్‌ ప్రభుత్వం సుప్రీంకు నివేదించింది.  నేటి సాంకేతిక యుగంలో పారదర్శకత కీలకమని పేర్కొంది. గోప్యతకు చెందిన పలు అం శాలు ప్రాథమిక హక్కులతో ముడిపడి ఉన్నాయంది. వ్యక్తిగత సమాచారం వాణిజ్య పరంగా దుర్వినియోగం కాకుండా టెలికాం నియంత్రణ సంస్థ(ట్రాయ్‌) చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.

 ఏదైనా పిల్‌ దాఖలు చేసే సమయంలో లాయర్లు కూడా తమ పేరు, చిరునామా, ఫోన్‌ నెంబర్, ఐడీ కార్డు తదితర వివరాలు ఇవ్వాలన్న సుప్రీం నిబంధనలను ఈ సందర్భంగా ప్రస్తావించారు.  అత్యున్నత న్యాయస్థానాలు సాంకేతికతతో ముందుకు సాగుతూ నిబంధనల పేరిట వ్యక్తిగత సమచారాన్ని కోరుతున్నాయని అన్నారు. గోప్యత హక్కును ఇతర ప్రాథమిక హక్కుల్లో భాగంగా చేర్చితే అభ్యంతరమేమీ లేదని, దాన్ని ప్రత్యేక ప్రాథమిక హక్కుగా ప్రకటించొద్దని విజ్ఞప్తి చేశారు. హరియాణా ప్రభుత్వ లాయర్లు కూడా గోప్యత హక్కును ప్రాథమిక హక్కుగా ప్రకటించరాదని కోర్టుకు విన్నవించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement