గోప్యత ప్రాథమిక హక్కా? కాదా?
నేడు విచారించనున్న 9 మంది సభ్యుల ధర్మాసనం
న్యూఢిల్లీ: భారత రాజ్యాంగం ప్రకారం వ్యక్తిగత వివరాల గోప్యతను ప్రాథమిక హక్కుగా ప్రకటించవచ్చా లేదా అనే విషయాన్ని తేల్చేందుకు 9 మంది సభ్యుల ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు మంగళవారం నిర్ణయించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్.ఖేహర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. గోప్యత హక్కుకు సంబంధించి 1950 నాటి ఎం.పీ.శర్మ కేసు, 1960 నాటి ఖరక్ సింగ్ కేసుల్లో ఇచ్చిన తీర్పుల్లో కూడా తప్పులున్నాయేమో సరిచూస్తామంది. గోప్యత ప్రాథమిక హక్కు కాదని ఈ కేసుల్లో సుప్రీంకోర్టు అప్ప ట్లో తీర్పునిచ్చింది.
9 మంది సభ్యుల ధర్మాసనం బుధవారం నుంచే విచారణ ప్రారంభించి..రాజ్యాంగంలోని మూడవ భాగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కుల కిందకు గోప్యత వస్తుందా లేదా అనే విషయాన్ని తేలుస్తుందని కోర్టు స్పష్టం చేసింది. ఆధార్ పథకం వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తోం దంటూ వచ్చిన కొన్ని పిటిషన్లను విచారిస్తూ కోర్టు పై ఆదేశాలిచ్చింది. 2015లో అప్పటి అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ ఈ పిటిషన్లపై వాదిస్తూ...గోప్యత ప్రాథమిక హక్కా, కాదా అన్న దానిపై సుప్రీంకోర్టు గత తీర్పుల్లోనే భిన్న నిర్ణయాలు వెలువడ్డాయన్నారు. ముందుగా దీనిపై తేల్చి, అనంతరం ఆధార్‌పై విచారించాలని కోర్టును కోరారు. అనంతరం ఈ పిటిషన్లను కోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి బదిలీ చేసింది. వీటిని మంగళవారం విచారించిన న్యాయస్థానం..9 మంది సభ్యుల ధర్మాసనం ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది.