కొత్త సీజేఐగా జస్టిస్ దీపక్ మిశ్రా
సుప్రీంకోర్టులో కీలక తీర్పులనిచ్చిన న్యాయమూర్తి
న్యూఢిల్లీ/భువనేశ్వర్: 45వ భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ దీపక్ మిశ్రా (63) నియమితులు కానున్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఆయనే అత్యంత సీనియర్ జడ్జి. జస్టిస్ దీపక్ మిశ్రాను సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ న్యాయమంత్రిత్వ శాఖ మంగళవారం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.
ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ పదవీ విరమణ చేసిన అనంతరం ఈ నెల 28న జస్టిస్ మిశ్రా బాధ్యతలు చేపడతారు. 13 నెలలపాటు ఆయన ప్రధాన న్యాయమూర్తి పదవిలో కొనసాగుతారు. జస్టిస్ దీపక్ మిశ్రాను తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా నియమించాల్సిందిగా జస్టిస్ జేఎస్ ఖేహర్ గత నెలలో న్యాయమంత్రిత్వ శాఖకు సిఫారసు చేయడం తెలిసిందే. సీజేఐ పదవిని చేపట్టనున్న మూడో ఒడిశా వ్యక్తి జస్టిస్ దీపక్ మిశ్రా. గతంలో ఒడిశాకు చెందిన జస్టిస్ రంగనాథ్ మిశ్రా, జస్టిస్ గోపాల వల్లభ పట్నాయక్‌లు సీజేఐలుగా పనిచేశారు.
సంచలన తీర్పులకు చిరునామా జస్టిస్ మిశ్రా!
1977లో న్యాయవాదిగా వృత్తి జీవితం ప్రారంభించిన మిశ్రా అంచెలంచెలుగా ఎదుగుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవిని అలంకరించనున్నారు. 1996లో ఒడిశా హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులైన ఆయన 1997లో మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2009లో పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ మిశ్రా... 2010లో ఢిల్లీ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. అనంతరం 2011లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎంపికయ్యారు.
సుప్రీంకోర్టు జడ్జిగా ఉండగా పలు కేసుల్లో సంచలనాత్మక తీర్పులను ఆయన వెలువరించారు. 1993 నాటి ముంబై పేలుళ్ల కేసులో దోషి ఉగ్రవాది యాకుబ్ మెమన్‌కు ఉరిశిక్ష అమలు చేసే సమయంలో అర్ధరాత్రి ఒంటిగంటకు సుప్రీంకోర్టు తలుపు తెరిచి విచారణ జరిపిన ధర్మాసనానికి జస్టిస్ మిశ్రా నేతృత్వం వహించారు. దేశాన్ని కుదిపేసిన 2012 డిసెంబరు 16 నాటి ఢిల్లీలో నిర్భయపై క్రూరమైన అత్యాచారం కేసులో నలుగురు దోషులకు ఢిల్లీ హైకోర్టు విధించిన మరణశిక్షను ఆయన సమర్థించారు.
సినిమా ప్రదర్శనకు ముందు థియేటర్లలో జాతీయగీతం వేయాలని తీర్పునిచ్చింది కూడా జస్టిస్ మిశ్రానే. ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్) నమోదైన 24 గంటల్లోపు వాటిని వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచాలని జస్టిస్ దీపక్ మిశ్రా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను ఆదేశించారు. తదుపరి సీజేఐగా జస్టిస్ మిశ్రాపై చాలా పెద్ద బాధ్యతలే ఉన్నాయి. అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత, కావేరీ జలాల వివాదం, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లో సంస్కరణలు, పనామా పేపర్ల లీకులు, సెబీ–సహారా చెల్లింపులు సహా పలు కీలక కేసులను విచారించే ధర్మాసనాలకు జస్టిస్ మిశ్రా నేతృత్వం వహించాల్సి ఉంటుంది.