శివసేనకు సురేష్ ప్రభు షాక్
న్యూఢిల్లీ: కేంద్రమంత్రివర్గ విస్తరణ శివసేన పార్టీలో చిచ్చు రేపింది. సురేష్ ప్రభు శివసేనతో తెగతెంపులు చేసుకున్నారు. బీజేపీలో చేరిపోయి కేంద్ర మంత్రి పదవి దక్కించుకున్నారు. కేంద్ర మంత్రిగా ఆదివారం మధ్యాహ్నం సురేష్ ప్రభు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనకు రైల్వే శాఖ అప్పగిస్తారని సమాచారం.
ప్రమాణ స్వీకారానికి ముందు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. సురేష్ ప్రభు ఈ ఉదయం శివసేనకు రాజీనామా చేసి బీజేపీ చేరిపోయారు. దీంతో ప్రమాణస్వీకారానికి శివసేన ప్రతినిధులు దూరంగా ఉండిపోయారు. మంత్రిగా ప్రమాణం స్వీకారం చేయాల్సిన తమ ఎంపీ అనిల్ దేశాయ్ ను ఢిల్లీ విమానాశ్రయం నుంచి శివసేన వెనక్కు రప్పించింది.
తమ పార్టీలో చిచ్చు పెట్టిన బీజేపీపై శివసేన రగిలిపోతోంది. ఎన్డీఏ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేయాలన్న ఆలోచనలో శివసేన ఉన్నట్టు సమాచారం.