ప్రతిపక్షంలోనే శివసేన!
న్యూఢిల్లీ:మహారాష్ట్రలో ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు శివసేన రెడీ అవుతోంది. తాజా కేంద్ర మంత్రివర్గ విస్తరణ కాస్తా చిచ్చురేపడంతో శివసేన-బీజేపీల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. సురేష్ ప్రభు శివసేనతో తెగతెంపులు చేసుకుని బీజేపీలో చేరడం.. ఆపై కేంద్ర మంత్రి పదవి దక్కించుకోవడం చకచకా జరిగిపోయాయి. ఇదే ఆ పార్టీల మధ్య అగ్గి రాజేస్తోంది. నాటకీయ పరిణామాల మధ్య సురేష్ ప్రభు ఆదివారం ఉదయం శివసేనకు రాజీనామా చేసి బీజేపీ లో చేరిపోయారు. దీంతో ప్రమాణస్వీకారానికి శివసేన ప్రతినిధులు దూరంగా ఉండిపోయారు. మంత్రిగా ప్రమాణం స్వీకారం చేయాల్సిన తమ ఎంపీ అనిల్ దేశాయ్ ను ఢిల్లీ విమానాశ్రయం నుంచి శివసేన వెనక్కు రప్పించింది.
ఇదిలా ఉండగా మహారాష్ట్రలో శివసేనకు ఇచ్చే మంత్రి పదవుల విషయంలో బీజేపీని ఉద్ధవ్ ఠాక్రే నిలదీశారు. ఎన్ని పదవులు తమకు ఇస్తారో తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై బీజేపీ లిఖిత పూర్వకంగా ఎటువంటి హామీ ఇవ్వకపోవడంతో తన మద్దతును ఉపసంహరించుకునేందుకు శివసేన సన్నద్ధమవుతోంది. ఒకవేళ ఎన్సీపీ మద్దతును బీజేపీ కోరితే మాత్రం మహారాష్ట్రలో ప్రతిపక్ష స్థానంలోనే ఉండిపోతామని శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే సంకేతాలిచ్చారు. ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో కొనసాగుతున్న అనంత గీతే అంశానికి సంబంధించి సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని ఠాక్రే తెలిపారు.