స్వామిగారు ఎందుకు సైలెంటయ్యారంటే!
న్యూఢిల్లీ: దేశ రాజకీయ, ఆర్థిక అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ.. దుమారం రేపే బీజేపీ ఫైర్‌బ్రాండ్ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి.. చరిత్రాత్మకమైన జీఎస్టీ బిల్లుపై మాత్రం మౌనం దాల్చారు. బుధవారం రాజ్యసభ ఆమోదించిన వస్తు సేవల పన్ను (జీఎస్టీ) బిల్లు యోగ్యతాయోగ్యతల గురించి తనకు మాట్లాడాలని ఉన్నా... తన ఆర్థిక ప్రావీణ్యం, పార్టీ విధేయత మధ్య ఇది ఘర్షణకు దారితీసే అవకాశముండటంతో తాను మౌనంగా ఉన్నట్టు స్వామి ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
' జీఎస్టీ పాత్ర, అవసరం ఎంతవరకు ఉందనే అంశంపై దేశభక్తులైన నెటిజన్లు ఎవరైనా సమగ్రంగా అధ్యయనం చేశారా?' అంటూ ఆయన ట్విట్టర్‌లో అడిగారు. ఓ ఫాలోవర్ స్పందిస్తూ ఆర్థిక వ్యవస్థపై ఈ బిల్లు ప్రభావం గురించి మీ అభిప్రాయాలను మీడియాకు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. స్వామి స్పందిస్తూ.. 'నా ఆర్థికశాస్త్ర ప్రావీణ్యం, పార్టీ విధేయత పట్ల ఘర్షణకు దారితీస్తుందనే నేను మౌనంగా ఉన్నాను' అని స్వామి చెప్పారు. తన అభిప్రాయాలు చెప్పడం వల్ల సొంత పార్టీ బీజేపీ ఎక్కడ నొచ్చుకుంటుందోనన్న అభిప్రాయాన్ని ఆయన పరోక్షంగా వ్యక్తంచేశారు. అంతేకాకుండా దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) పెరుగాలంటే అందుకు అధిక పెట్టుబడులు, మూలధనం, అధిక కార్మిక ఉత్పాదకత మాత్రమే మార్గమని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.