నగరంపై ‘ఫ్లూ’ పంజా | Swine flu With five peoples killed | Sakshi
Sakshi News home page

నగరంపై ‘ఫ్లూ’ పంజా

Published Tue, Sep 15 2015 1:34 AM | Last Updated on Sat, Aug 25 2018 6:13 PM

నగరంపై ‘ఫ్లూ’ పంజా - Sakshi

నగరంపై ‘ఫ్లూ’ పంజా

స్వైన్‌ఫ్లూతో ఇరువురి మృతి
* మరోవైపు విజృంభిస్తున్న డెంగీ
* ఇద్దరు చిన్నారుల దుర్మరణం
సాక్షి, హైదరాబాద్: స్వైన్‌ఫ్లూ... డెంగీ.. రెండు ‘ఫ్లూ’లు నగరంలో మృత్యు ఘంటికలు మోగిస్తున్నాయి. వీటి కారణంగా గత వారం రోజుల్లో ఐదుగురు మృతి చెందారు. తాజాగా సోమవారం స్వైన్‌ఫ్లూ ధాటికి ఇద్దరు మహిళలు, డెంగీ ధాటికి మరో ఇద్దరు చిన్నారులు బలయ్యారు. స్వైన్‌ఫ్లూతో గాంధీ ఆస్పత్రిలో ఒకరు, అవేర్ గ్లోబల్ ఆస్పత్రిలో మరొకరు చనిపోయారు. దీంతో ‘ఫ్లూ’ మరణాలు ఈ నెలలో తొమ్మిదికి చేరాయి. ప్రస్తుతం పలు ఆస్పత్రుల్లో మరో ఐదుగురు పాజిటివ్ బాధితులు చికిత్స పొందుతున్నారు.
 
స్వైన్‌ఫ్లూతో ఇద్దరు మృతి..
గ్రేటర్‌లో ఈ ఏడాది ఇప్పటి వరకు 1085  స్వైన్‌ఫ్లూ కేసులు నమోదు కాగా, ఇటీవలే ఇద్దరు మృతి చెందారు. తాజాగా సోమవారం మరో ఇద్దరు మహిళలు చనిపోవడంతో స్వైన్‌ఫ్లూ మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. నగరంలోని పాతబస్తీ ఫలక్‌నుమాకు చెందిన మహిళ(60)కు తీవ్ర జ్వరం రావడంతో ఈ నెల 11న చికిత్స నిమిత్తం ఎల్‌బీనగర్‌లోని అవేర్ గ్లోబల్ ఆసుపత్రిలో చేర్పించారు. స్వైన్‌ఫ్లూ సోకిందనే అనుమానంతో వైద్యులు ఆమె రక్త నమూనాలను ఐపీఎం పరీక్షలకు పంపారు.

నివేదిక రాకముందే చికిత్స పొందుతూ ఆమె సోమవారం రాత్రి మృతి చెందింది. మహబూబ్‌నగర్‌కు చెందిన మరో మహిళ కూడా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఓ మహిళ(37) హైదరాబాద్ కిడ్నీ సెంటర్‌లో చికిత్స పొందుతోంది. బోడుప్పల్‌కు చెందిన మహిళ(59)తో పాటు మౌలాలికి చెందిన మరో మహిళ(25) గాంధీ జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కడపకు చెందిన మరో వ్యక్తి(52) సన్‌షైన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

వీరందరికీ పరీక్ష నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరితో పాటు మరో పది మంది ఫ్లూ అనుమానితులు చికిత్స పొందుతున్నారు. వీరికి ప్రభుత్వం ‘ఒసల్టా మీవీర్ టా బ్లెట్స్, సిరప్’లను ఉచితంగా సరఫరా చేస్తు న్నా.. చికిత్సల పేరుతో కార్పొరేట్ ఆస్పత్రులు సొమ్ము చేసుకుంటున్నాయి. ప్రభుత్వం గాంధీ, ఉస్మానియా, ఫీవర్ ఆస్పత్రుల్లో స్వైన్ ఫ్లూ నోడల్ కేంద్రాలను ఏర్పాటు చేసినా ఆశించిన స్థాయిలో సేవలు అందడం లేదు. రోగుల నుంచి నమూనాలు సేకరించి, ఐపీఎంకు పంపడంలో జాప్యం జరుగుతుం డటంతో రిపోర్టు వచ్చేలోపే చనిపోతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 
మరో 20 మంది బాధితులు...
హైదరాబాద్‌లో ఇప్పటికే 153 డెంగీ కేసులు నమోదు కాగా, వీరిలో ఇప్పటికే ఐదుగురు మృతి చెందారు. ప్రస్తుతం మరో 20 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా డెంగీకి ‘ఐజీఎం ఎలిసా’టెస్టును ప్రమాణికంగా ప్రభుత్వం నిర్ణయిం చగా, కార్పొరేట్ ఆస్పత్రులు మాత్రం ‘ఎన్‌ఎస్ 1’ టెస్టును తీసుకుంటూ వైద్య సేవల పే రుతో నిలువు దోపిడీకి పాల్పడుతున్నాయి.
 
డెంగీతో ఇద్దరు చిన్నారుల మృతి...
గ్రేటర్‌లో డెంగీ మృత్యు ఘంటికలు మోగిస్తోంది. రెండు రోజుల క్రితం నిండు గర్భిణి మృతి చెందిన వార్త మరువక ముందే మరో ఇద్దరు చిన్నారులను డెంగీ బలి తీసుకుంది. ఎల్‌బీ నగర్‌లో నివసించే నర్సింహారెడ్డి వృత్తి రీత్యా డ్రైవర్. ఈయన భార్య జ్యోతి. వీరి కూతురు అన్విక(5).. ఉప్పల్ విజయపురి కాలనీలో నివాసముండే పెద్దమ్మ లక్ష్మీ వద్ద ఉంటోంది. తీవ్ర జ్వరం రావడంతో ఉప్పల్‌లోని శ్రీద హాస్పిటల్‌లో ఈ నెల 12న చేర్పించగా డెంగీ అని నిర్ధారించారు.

చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అలాగే జంగమ్మెట్ మార్కెట్ ప్రాంతానికి చెందిన శేఖర్ గౌడ్, వనజ దంపతుల పెద్ద కుమార్తె అక్షయ(6) ఖాద్రీ చమాన్ ప్రాంతంలోని సెయింట్ ఫీటర్ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది. ఐదు రోజుల నుంచి బాలిక అనారోగ్యంతో బాధ పడుతుండడంతో శేఖర్ శనివారం నైస్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ అక్షయ ఆదివారం రాత్రి మృతి చెందింది. డెంగీ కారణంగానే అక్షయ మృతి చెందిందని ఆసుపత్రి వైద్యులు మరణ ధృవీకరణ సర్టిఫికెట్‌ను జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement