అసెంబ్లీకి సేవ చేయడానికి వచ్చారా ? లేక ...
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేశానని చెప్పి అందరినీ మోసం చేశారని శాసన మండలిలోని ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్లో సీఎల్పీ కార్యాలయంలో షబ్బీర్ అలీ మాట్లాడారు. అంతేకాకుండా తలసాని రాజ్యాంగ వ్యవస్థను తప్పుదోవపట్టించారని విమర్శించారు.
అసెంబ్లీకి సేవ చేయడానికి వచ్చారా ? లేక మోసం చేయడానికి వచ్చారా అంటూ తలసానిని షబ్బీర్ అలీ సూటిగా ప్రశ్నించారు. తలసానిపై చీటింగ్ కేసు పెట్టాలని... అలాగే కేసీఆర్ కేబినెట్ నుంచి వెంటనే తలసానిని బర్తరఫ్ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తలసాని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారో లేదో తెలుసుకోకుండా గవర్నర్ ఆయనతో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించి తప్పు చేశారన్నారు. నైతికత ఉంటే గవర్నర్ కూడా రాజీనామా చేయాలన్నారు.
ఈ అంశంపై స్పీకర్ కూడా స్పందించకపోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఆదర్శపాలన అంటే ఈ విధంగా మోసం చేసి పదవులను అనుభవించటమేనా అని కేసీఆర్ ప్రభుత్వంలోని పెద్దలను ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై పార్లమెంట్లో కాంగ్రెస్ నేతలు లేవనెత్తుతారని షబ్బీర్ అలీ స్పష్టం చేశారు.