మర్రి... వర్రీ అవుతున్నారు..
అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉన్న పార్టీ ఏదీ అని పాలబుగ్గల పసివాడిని అడిగినా... కాంగ్రెస్ పార్టీ అంటూ ఠకీమని జవాబు చెబుతాడు. అలాంటి పార్టీలో ఓ నాయకుడికి ఢిల్లీలో కాదు గల్లీలో పదవి వస్తే ఎలా చెలరేగుతాడో ఇట్టే ఊహించుకోవచ్చు. కానీ అటువంటి పార్టీలో అలాంటి ఇలాంటి బ్యాక్ గ్రౌండ్ కాదు తండ్రిముఖ్యమంత్రి గానే కాక పలు రాష్ట్రాలకు గవర్నర్గా కూడా పని చేశారు. ఒకానొక దశలో హస్తం పార్టీ అధిష్టానం కూడా ఈయన తండ్రిగారితో మీరు ఎంతంటే అంతా అనేది.
అలాంటి వారసత్వం నుంచి వచ్చిన నేత మాత్రం మాంచీ ఊపు ఉత్సాహంతో ఉండకుండా సాదా సీదాగా ఉంటూ...తెలుగు రాష్ట్రాలలో ఆయనంతటి కామ్ గోయింగ్ పర్సన్ మరొకరు లేనట్లు వ్యవహరించే వారు. ఇంకా చెప్పాలంటే ప్రతిపక్షంలోని వారినే కాదు స్వపక్షంలోని వారిని కూడా పల్లెత్తి మాట మాట్లాడిన దాఖలాలు లేవు.
ఇప్పటికే గుర్తు వచ్చిఉంటుంది ఆయనేవరో.. మర్రి చెన్నారెడ్డి తనయుడు మర్రి శశిధర్రెడ్డి. అయితే 2014 ఎన్నికల్లో సనత్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థి (అప్పటి) తలసాని శ్రీనివాసయాదవ్ చేతితో ఓటమి పాలైయ్యారు. గెలుపోటములు సహాజమే. కానీ పక్క నియోజకవర్గం నుంచి వచ్చి తనపై పోటీ చేసి గెలిచిన తలసాని అప్పటి వరకు రింగరింగా అంటూ తిరిగిన రెండు చక్రాల సైకిల్కు గుడ్ బై చెప్పి నాలుగు చక్రాల కారెక్కి... కేసీఆర్ మంత్రి వర్గంలో కీలక శాఖను కొట్టేశారు. దాంతో మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్రెడ్డికి వర్రీ మొదలైంది. తలసాని రాజీనామా ఆమోదించకుండా ఎలా మంత్రి పదవిలో కూర్చోబెడతారంటూ స్పీకర్, కేసీఆర్పై మండిపడ్డారు.
ఇక రాష్ట్ర గవర్నర్పై... రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ నిప్పులు చెరిగారు. ఏకంగా కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్కు గవర్నర్పై ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు. నోట్లో నాలుక లేనట్లు ఉండే మర్రి శశిధర్ రెడ్డి ఇలా మాట్లాడటం చూసి అన్ని పార్టీల నేతలు నిశ్చేష్టులవుతున్నారు. టీటీడీపీ నేతలైతే మనపని కూడా ఆయనగారే చేస్తున్నారని మహాదానంద పడ్డారు.
తలసాని రాజీనామాను ఆమోదిస్తే సనత్నగర్ ఉప ఎన్నిక వస్తుంది. ఆ ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసి తన సత్తా చాటుకునేందుకు ఆయనగారు ఇంతగా వర్రీ అవుతున్నారని నేతలంతా తమలోతాము గుసగుసలాడుకుంటున్నారు. మర్రి శశిధర్ రెడ్డి సనత్ నగర్ అసెంబ్లీ స్థానానికి ఐదుసార్లు పోటీ చేయగా మూడు సార్లే గెలిచారు. ఓ వేళ తలసాని రాజీనామా ఆమోదం పొంది...ఆ స్థానానికి ఉప ఎన్నిక జరిగినా... మర్రిని గెలిపిస్తారా లేదా.. తలసానికే ఆ సీటు కట్టబెడతారా అనేది ఆ నియోజకవర్గ ప్రజలే చెప్పాలి.