సీఎం పదవి కోసం అన్నింటికీ ఒప్పుకుంటున్నారు
న్యూఢిల్లీ : హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా ఒప్పుకునేది లేదని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. కేవలం పరిపాలన కోసం కొంతకాలం ఉండవచ్చని ఆయన అన్నారు. జీవోఎంతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ శాంతి భద్రతల అంశం కేంద్రం చేతిలో ఉండటం రాజ్యాంగ విరుద్ధమన్నారు. రాజ్యాంగంలోని షెడ్యూల్ 7లో ఇదే చెపుతుందన్నారు. తెలంగాణలో ఉర్దూను అధికార భాషగా అమలు చేయాలని అసదుద్దీన్ డిమాండ్ చేశారు.
సీమాంధ్ర కేంద్రమంత్రులకు ఈ ప్రాథమిక విషయాలు తెలియవని అసదుద్దీన్ అన్నారు. తెలంగాణలో, ఆంధ్రాలో భూమికి సంబంధించిన చట్టాలు వేరుగా ఉన్నాయన్నారు. రాజ్యాంగం ప్రకారం సీమాంధ్ర రెవెన్యూను తెలంగాణకు తరలించలేరన్నారు. ఖైరతాబాద్ మండల పరిధిలో సీమాంధ్ర తాత్కాలిక రాజధాని ఉండాలని ఆయన పేర్కొన్నారు.
హైదరాబాద్లో తానొక్కడినే కారులో తిరుగుతానని.... తనకు లేని ఆందోళన సీమాంధ్రులకు ఎందుకు అని ప్రశ్నించారు.
తెలంగాణలో సీమాంధ్ర ప్రజలకు ఎలాంటి భయం వద్దని అసదుద్దీన్ అన్నారు. సీమాంధ్రులకు తెలంగాణలో ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. హైదరాబాద్లో ఉన్న రక్షణ శాఖ కార్యాలయాలకు భద్రత ఉండగా సీమాంధ్రులకు భయమెందుకన్నారు. హైకోర్టును తక్షణమే రెండుగా విభజించాలని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతల స్వార్థబుద్ధిని తాను ఖండిస్తున్నట్లు ఒవైసీ అన్నారు. కేవలం సీఎం పదవి కోసం అన్నింటికీ ఒప్పుకుంటున్నారని ఆయన విమర్శించారు. అలా ఒప్పుకునే హక్కు వారికి ఎవరు ఇచ్చారని ఒవైసీ ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను పణంగా పెడుతున్నారని ఆయన మండిపడ్డారు.
నిర్దేశిత కాల పరిమితిలోగా విభజన చేయమని జీవోఎంను కోరినట్లు ఒవైసీ తెలిపారు. తెలంగాణలోని ముస్లింలకు, క్రైస్తవులకు ముప్పు ఉందని... అయితే సీమాంధ్ర ప్రజలకు కాదని ఆయన అన్నారు. బీజేపీ, సంఘ్ పరివార్ శక్తులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మత ఘర్షణల నివారణ బిల్లు ప్రవేశపెట్టాలన్నారు. అనంతపురం , కర్నూలు జిల్లాలను తెలంగాణ కలపాలన్నారు. రాయలసీమ ప్రాంతాన్ని మొత్తం తెలంగాణలో కలుపుతామన్నా తమకు ఇబ్బంది లేదని ఒవైసీ తెలిపారు.