మహానేత అంబేడ్కర్: మోదీ
న్యూఢిల్లీ: జీవితంలోని అన్ని ప్రతికూలతలను, కష్టాలను అధిగమించి దేశానికి రాజ్యాంగాన్ని ప్రసాదించిన మహానేత అంబేడ్కర్ అని ప్రధాని నరేంద్రమోదీ కొనియాడారు. జాతి నిర్మాణంలో బాబాసాహెబ్ అంబేడ్కర్ పాత్ర శ్లాఘనీయమని ఆయన ప్రశంసించారు. గురువారం న్యూఢిల్లీలో జరిగిన ఎన్‌సీసీ ర్యాలీలో విద్యార్థులనుద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడారు. దేశ సంక్షేమం కోసం జీవితాలను అంకితం చేయాలని ఈ సందర్భంగా మోదీ విద్యార్థులకు పిలుపునిచ్చారు. రిపబ్లిక్ డే ఉత్సవాల కోసం గత నెల రోజులుగా ఢిల్లీలో ఉంటున్న మీరు గమనించిన మంచి విషయాలన్నింటినీ స్వీకరించి ఆచరణలో పెట్టాలని కోరారు.
అంతేకాకుండా విద్యార్థులు తమ ఊళ్లకు వెళ్లాక దేశభక్తి, స్వచ్ఛత అనే విలువలను పెంపొందించాలని సూచించారు. దేశ యువతను ఏకతాటిపై నిలిపి ఏకత్వాన్ని కాపాడడానికి ఎన్‌సీసీ ఎంతగానో తోడ్పడుతోందని అభినందించారు. ఈ గణతంత్ర దినోత్సవంతో పాటు అంబేడ్కర్ 125వ జయంతి ఉత్సవాలు కూడా ఒకేసారి రావడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
మరోవైపు బోస్టన్‌లోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంస్థ చైర్మన్ రాఫెల్ రీఫ్, ఫాకల్టీ సభ్యులతో కలిసి ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్టార్ట్‌అప్ ఇండియా తదితర పథకాలకు తమ సంస్థ సహకారాన్ని అందిస్తుందని రాఫెల్ ఈ సందర్భంగా తెలిపారు.