దాచేస్తే నిజాలు దాగవు | PM Modi attack on congress over Amit Shah Ambedkar remarks | Sakshi
Sakshi News home page

దాచేస్తే నిజాలు దాగవు

Published Wed, Dec 18 2024 1:57 PM | Last Updated on Thu, Dec 19 2024 5:07 AM

PM Modi attack on congress over Amit Shah Ambedkar remarks

అంబేడ్కర్‌ను అవమానించింది కాంగ్రెసే: మోదీ

ఆయనను రెండుసార్లు ఓడించింది.. భారతరత్న ఇవ్వలేదు  

నిజాలు బయటపెట్టినందుకే అమిత్‌ షాపై కాంగ్రెస్‌ అక్కసు  

అంబేడ్కర్‌ పట్ల మా భక్తి ప్రపత్తులు, గౌరవం తిరుగులేనివి   

న్యూఢిల్లీ: రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ను కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అవమానించారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిప్పికొట్టారు. అంబేడ్కర్‌ను పదేపదే దారుణంగా కించపర్చింది కాంగ్రెస్‌ పార్టీ కాదా? అని నిలదీశారు. కాంగ్రెస్‌ చీకటి చరిత్రను అమిత్‌ షా బయటపెట్టారని చెప్పారు. అది తట్టుకోలేక ఆయనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. నిజానిజాలేమిటో దేశ ప్రజలకు తెలుసని పేర్కొన్నారు.

 దాచేస్తే నిజాలు దాగవని తేలి్చచెప్పారు. ఈ మేరకు మోదీ బుధవారం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. వాస్తవానికి అంబేడ్కర్‌ను అమితంగా గౌరవిస్తున్నది తామేనని వెల్లడించారు. అంబేడ్కర్‌ పట్ల తమ ప్రభుత్వానికి ఎనలేని గౌరవాభిమానాలు ఉన్నాయని ఉద్ఘాటించారు. ‘‘సులువుగా అబద్ధాలు చెప్పేస్తే, చాలా ఏళ్లపాటు చేసిన తప్పిదాలన్నీ మరుగున పడిపోతాయని కాంగ్రెస్‌ భావిస్తోంది. అంబేడ్కర్‌ను కించపర్చింది ముమ్మాటికీ కాంగ్రెస్సే. 

అబద్ధాలతో నిజాలను కప్పిపుచ్చాలనుకుంటే అది పొరపాటే అవుతుంది. నెహ్రూ–గాంధీ కుటుంబం నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ అంబేడ్కర్‌ను పదేపదే అవమానించింది. ఆయన ఘనతను తక్కువ చేసి చూపడానికి చిల్లర ప్రయత్నాలన్నీ చేసింది. ఎస్సీ, ఎస్టీలను సైతం ఘోరంగా అవమానించింది. అంబేడ్కర్‌ పట్ల కాంగ్రెస్‌ పాపాలు చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి. ఆయనను రెండుసార్లు ఎన్నికల్లో ఓడించింది. అంబేడ్కర్‌కు వ్యతిరేకంగా జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రచారం చేశారు. ఆయనను ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. 

అంబేడ్కర్‌కు భారతరత్న పురస్కారం ఇవ్వడానికి నిరాకరించారు. ఆ మహోన్నత వ్యక్తి చిత్రపటాన్ని పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో ఏర్పాటు చేయడానికి అనుమతి ఇవ్వలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వాల పాలనలో ఎస్సీ, ఎస్టీలపై లెక్కలేనన్ని మారణహోమాలు జరిగాయి. ఏళ్ల తరబడి అధికారం చెలాయించిన కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ, ఎస్టీల సాధికారత, అభివృద్ధి కోసం ఏనాడూ కృషిచేయలేదు. అంబేడ్కర్‌ దయ వల్లే మేము ఈరోజు ఈ స్థానంలో ఉన్నాం. అంబేడ్కర్‌ అడుగుజాడల్లో నడుస్తూ ఆయన సిద్ధాంతాలు అమలు చేస్తున్నాం. రాజ్యాంగ నిర్మాత గౌరవాన్ని మరింత ఇనుమడింపజేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం.  

చైత్యభూమిలో స్వయంగా ప్రార్థనలు చేశా  
అంబేడ్కర్‌ దార్శనికతే మాకు ప్రామాణికం. దేశంలో గత పదేళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చాం. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని బలోపేతం చేశాం. సమాజంలో పేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా పీఎం ఆవాస్‌ యోజన, జలజీవన్‌ మిషన్, ఉజ్వల యోజన, స్వచ్ఛభారత్‌ వంటి పథకాలు తీసుకొచ్చాం. మేము ప్రారంభించిన ప్రతి పథకం పేదల జీవితాలను ప్రభావితం చేస్తోంది. 

అంబేడ్కర్‌ జీవితానికి సంబంధించిన ఐదు ప్రముఖ క్షేత్రాలను పంచతీర్థాలుగా అభివృద్ధి చేస్తున్నాం. అంబేడ్కర్‌ స్మృతిస్థలమైన చైత్యభూమికి సంబంధించిన భూమి దశాబ్దాలుగా వివాదంలో ఉండేది. మేము అధికారంలోకి వచ్చాక ఆ వివాదం పరిష్కరించాం. ఆ పవిత్రమైన స్థలంలో నేను స్వయంగా ప్రార్థనలు చేశా. ఢిల్లీలో అంబేడ్కర్‌ చివరి రోజులు గడిపిన భవనాన్ని సుందరంగా తీర్చిదిద్దాం. లండన్‌లో ఆయన నివసించిన భవనాన్ని మా ప్రభుత్వం కొనుగోలు చేసింది. అంబేడ్కర్‌ పట్ల మా భక్తి ప్రపత్తులు, గౌరవం తిరుగులేనివి’’ అని ప్రధాని మోదీ స్పష్టంచేశారు.   
 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement