NCC Rally
-
జమిలిపై చర్చ...చాలా కీలకం
న్యూఢిల్లీ: ‘ఒక దేశం, ఒకే ఎన్నిక’ ప్రతిపాదనపై దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ భారత ప్రజాస్వామ్య ప్రస్థానానికి చాలా కీలకమైనదని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఎన్సీసీ క్యాడెట్లు, ఎన్ఎస్ఎస్ వలెంటీర్లు, యువత అందులో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇది వారి భవిష్యత్తుతో నేరుగా ముడిపడ్డ అంశమని గుర్తుంచుకోవాలన్నారు. సోమవారం ఇక్కడ ఎన్సీసీ ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘‘మన దేశంలో పదేపదే ఎన్నికలు జరుగుతున్నాయి. నిత్యం ఏదో ఒక మూల ఎన్నికల వాతావరణం నెలకొని ఉంటోంది. దాంతో పాలన, అభివృద్ధి పనుల వేగం మందగిస్తోంది. లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలూ ఒకేసారి జరిగితే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మొదట్లో దేశమంతటా ఒకేసారి ఎన్నికలు జరిగేవి. తర్వాతి కాలంలో ఆ ప్రక్రియకు విఘాతం కలిగింది. అమెరికా వంటి అగ్ర రాజ్యాల్లో ఎన్నికలు నిరీ్ణత కాలావధిలోనే జరుగుతాయి’’ అని గుర్తు చేశారు. కనీసం లక్షమంది యువతీ యువకులు రాజకీయాల్లోకి రావాలని పునరుద్ఘాటించారు. ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగంలోనూ ఇదే మాట చెప్పానని గుర్తు చేశారు. -
దేశ రక్షణలో రాజీ లేదు!
న్యూఢిల్లీ: భారత్ శాంతికాముక దేశమే అయినా.. దేశ రక్షణ విషయంలో రాజీ పడబోదని ప్రధాని మోదీ తేల్చి చెప్పారు. యుద్ధ విమానాలు, సాయుధ దళాల ఆధునీకరణలకు సంబంధించి దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రక్షణ రంగ ప్రాజెక్టులకు తాము అధికారంలోకి వచ్చాకే మోక్షం వచ్చిందని మోదీ గుర్తు చేశారు. దేశీయంగా క్షిపణులు, యుద్ధ ట్యాంకులు, హెలికాప్టర్లను ఉత్పత్తి చేస్తున్నామన్నారు. రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందానికి సంబంధించి మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఆరోపణల నేపథ్యంలో మోదీ స్పందించారు. తాను స్వప్నిస్తున్న ‘నవ భారత్’లో అవినీతికి చోటు లేదన్న మోదీ.. అవినీతికి పాల్పడిన వారిని ఎంతవారైనా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఎన్సీసీ క్యాడెట్లను ఉద్దేశించి సోమవారం ఆయన ప్రసంగించారు. ‘మీ భవిష్యత్తును నిర్దేశించేవి మీ కుటుంబం, మీ ఆర్థిక నేపథ్యం కాదు.. మీ పట్టుదల, మీ నైపుణ్యం, మీ ఆత్మవిశ్వాసమే బంగారు భవితకు బాటలు వేస్తుంది’ అని అన్నారు. వీఐపీ సంస్కృతి స్థానంలో తన ప్రభుత్వం ఈపీఐ(ఎవ్రీ పర్సన్ ఈజ్ ఇంపార్టెంట్– ప్రతీ వ్యక్తి ప్రముఖుడే) సంస్కృతిని చేర్చిందన్నారు. గ్రామాల నుంచి వచ్చి ఎన్సీసీలో శిక్షణ పొందుతున్న వారిని ప్రధాని ఈ సందర్భంగా అభినందించారు. తమ ప్రభుత్వం గత నాలుగున్నరేళ్లుగా రక్షణ శాఖలో చేపట్టిన ప్రాజెక్టులన్నీ భవిష్యత్‌లో దేశ భద్రతకు తోడ్పడతాయని ధీమా వ్యక్తం చేశారు. అప్పటివరకు దేశ ప్రజలు తమపై భరోసా ఉంచాలన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని.. రాబోయే ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో ఓటు వేసేలా యువతను ప్రోత్సహించాలని వారికి సూచించారు. ఇక తమ ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమానికి యువత భారీగా మద్దతు ఇస్తున్నట్లు ప్రధాని తెలిపారు. లింగ వివక్షకు తావీయకుండా స్త్రీ, పురుషులిద్దరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని మోదీ ఉద్ఘాటించారు. మహిళలను యుద్ధ విమానాలకు పైలట్లుగా నియమించామని, నేవీలోని మహిళా దళాలు ప్రపంచాన్ని చుట్టివచ్చాయని తెలిపారు. మిలటరీ సహా పలు కీలక విభాగాల్లో మహిళలను భాగస్వామ్యం చేసేలా తమ ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. బెంగాల్లో ప్రధాని ర్యాలీ ప్రాంతం మార్పు పశ్చిమ బెంగాల్లో ఫిబ్రవరి 2న ప్రధాని మోదీ పాల్గొననున్న బహిరంగ సభ స్థలాన్ని మార్చినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ వెల్లడించారు. ముందుగా అనుకున్నట్లు నార్త్ 24 పరగణా జిల్లాలోని థాకూర్‌నగర్‌లో కాకుండా దానికి సమీపంలోని మరో స్థలంలో ర్యాలీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. -
మహానేత అంబేడ్కర్: మోదీ
న్యూఢిల్లీ: జీవితంలోని అన్ని ప్రతికూలతలను, కష్టాలను అధిగమించి దేశానికి రాజ్యాంగాన్ని ప్రసాదించిన మహానేత అంబేడ్కర్ అని ప్రధాని నరేంద్రమోదీ కొనియాడారు. జాతి నిర్మాణంలో బాబాసాహెబ్ అంబేడ్కర్ పాత్ర శ్లాఘనీయమని ఆయన ప్రశంసించారు. గురువారం న్యూఢిల్లీలో జరిగిన ఎన్సీసీ ర్యాలీలో విద్యార్థులనుద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడారు. దేశ సంక్షేమం కోసం జీవితాలను అంకితం చేయాలని ఈ సందర్భంగా మోదీ విద్యార్థులకు పిలుపునిచ్చారు. రిపబ్లిక్ డే ఉత్సవాల కోసం గత నెల రోజులుగా ఢిల్లీలో ఉంటున్న మీరు గమనించిన మంచి విషయాలన్నింటినీ స్వీకరించి ఆచరణలో పెట్టాలని కోరారు. అంతేకాకుండా విద్యార్థులు తమ ఊళ్లకు వెళ్లాక దేశభక్తి, స్వచ్ఛత అనే విలువలను పెంపొందించాలని సూచించారు. దేశ యువతను ఏకతాటిపై నిలిపి ఏకత్వాన్ని కాపాడడానికి ఎన్సీసీ ఎంతగానో తోడ్పడుతోందని అభినందించారు. ఈ గణతంత్ర దినోత్సవంతో పాటు అంబేడ్కర్ 125వ జయంతి ఉత్సవాలు కూడా ఒకేసారి రావడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. మరోవైపు బోస్టన్లోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంస్థ చైర్మన్ రాఫెల్ రీఫ్, ఫాకల్టీ సభ్యులతో కలిసి ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్టార్ట్అప్ ఇండియా తదితర పథకాలకు తమ సంస్థ సహకారాన్ని అందిస్తుందని రాఫెల్ ఈ సందర్భంగా తెలిపారు.