చచ్చిన పాములను నోట్లో పెట్టుకుని..
న్యూఢిల్లీ: కరువు ఉపశమన ప్యాకేజీ, రుణ మాఫీ డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద గత 16 రోజులుగా తమిళనాడు రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. బుధవారం అన్నదాతలు వినూత్నంగా ఆందోళకు దిగారు. కొంత మంది రైతులు చచ్చిపోయిన పాములను నోట్లో పెట్టుకుని ఆందోళనలో పాల్గొన్నారు. ఇంతకుముందు ఎలుకలను నోట్లో పెట్టుకుని నిరసన తెలిపారు. కపాలాలు మెడలో వేసుకుని కూడా ఆందోళన చేశారు. తాము ఎన్నిరకాలుగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం ఎటువంటి స్పందన రాకపోవడం పట్ల రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కాగా, ఆందోళన చేస్తున్న రైతులకు తమిళనాడు చెందిన నాయకులు పార్టీలకు అతీతంగా మద్దతు తెల్పుతున్నారు. లోక్‌సభ డీప్యూటీ స్పీకర్ తంబిదురై(ఏఐఏడీఎంకే) మంగళవారం ఆందోళన చేస్తున్న రైతులను కలుసుకుని సమస్యను వీలైనంత తొందరగా ప్రధాని దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. సంబంధిత మంత్రులను కలుసుకున్నామని, ఈ విషయాన్ని పార్లమెంట్‌లో కూడా లేవనెత్తామని ఆయన చెప్పారు. ఇది కేవలం ఒక రాష్ట్ర సమస్య కాదని మొత్తం దేశానిదని అన్నారు. నిరసనలను ఉపసంహరించుకోవాలని కూడా ఆయన రైతులను కోరారు.
తంబిదురై వెంట వచ్చిన తమిళనాడు వ్యవసాయ మంత్రి ఆర్.దొరైక్కన్ను... రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను వారికి వివరించారు. డీఎంకే రాజ్యసభ సభ్యులు టీకేఎస్ ఎలంగోవన్, ఆర్‌ఎస్ భారతి, పుదుచ్చేరి సీఎం వి.నారాయణ స్వామి కూడా రైతులకు కలుసుకుని మద్దతు ప్రకటించారు. రైతులకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో త్వరలోనే సమావేశం ఏర్పాటుచేస్తామని తమిళ మనీలా కాంగ్రెస్ చీఫ్ జీకే వాసన్ అన్నారు.