నస్లీ వాడియాకు టాటా స్టీల్ గుడ్ బై
నస్లీ వాడియాకు టాటా స్టీల్ గుడ్ బై
Published Thu, Dec 22 2016 10:33 AM | Last Updated on Mon, Sep 4 2017 11:22 PM
టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి అర్థాంతరంగా తప్పించిన సైరస్ మిస్త్రీకి మద్దతుగా నిలుస్తున్నారనే నెపంతో ప్రముఖ పారిశ్రామిక వేత్త నస్లీ వాడియాకు టాటా స్టీల్ గుడ్ బై చెప్పింది. బుధవారం జరిగిన అసాధారణ సర్వసభ్య సమావేశంలో స్వతంత్ర డైరెక్టర్గా ఆయనకు ఉద్వాసన పలుకుతున్నట్టు టాటా స్టీల్ వెల్లడించింది. నస్లీ వాడియాకు వ్యతిరేకంగా 90 శాతం ఓటింగ్ నమోదైనట్టు తెలిసింది. చాలామంది షేర్ హోల్డర్స్ వాడియాను తొలగించడానికే మొగ్గుచూపినట్టు బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ రెగ్యులేటరీకి టాటా స్టీల్ పేర్కొంది. తనకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ ఓటింగ్లో నస్లీ వాడియా పాల్గొన్నలేదు. 37 ఏళ్లుగా నస్లీ వాడియా టాటా స్టీల్ స్వతంత్ర డైరెక్టర్గా ఉన్నారు.
చైర్మన్గా గ్రూప్ కంపెనీల నుంచి బయటికి గెంటివేయబడ్డ సైరస్ మిస్త్రీకి నస్లీ వాడియా మద్దతుగా నిలవడంతో పాటు టాటా గ్రూప్పై పలు విమర్శలు సంధించారు. దీంతో ఆగ్రహించిన టాటా సన్స్ , గ్రూపు కంపెనీల నుంచి స్వతంత్ర డైరెక్టర్ నస్లీ వాడియాను సాగనంపే ప్రక్రియను ప్రారంభించింది. స్వతంత్ర డైరెక్టర్ అయిన తనను ఈ సమావేశాల ద్వారా తొలగించే సత్తా టాటా సన్స్కు ఉందా? అంటూ ప్రశ్నలను సైతం ఆయన సంధించారు. ఈ నేపథ్యంలోనే బుధవారం జరిగిన ఈజీఎంలో టాటా స్టీల్ నస్లి వాడియాను కంపెనీ స్వతంత్ర డైరెక్టర్గా తప్పిస్తున్నట్టు నిర్ణయం తీసుకుంది. టాటా మోటార్స్, టాటా కెమెకిల్స్ కూడా ఈ వారంలో వాడియాను డైరెక్టర్గా తొలగించేందుకు ఈజీఎంలు నిర్వహించనున్నాయి.
అయితే కంపెనీల స్వతంత్ర డైరెక్టర్గా తనను తొలగిస్తుండటం వివరణ కోరిన అనంతరం రతన్ టాటా, టాటా సన్స్, కొంతమంది డైరెక్టర్లపై నుస్లీ వాడియా రూ.3000 కోట్ల పరువు నష్టం దావా కూడా వేశారు. దీంతో ఇక ఆయన టాటా గ్రూప్ సంస్థల్లో ఉండటం ఏ మాత్రం మంచిది కాదని టాటా సన్స్ నిర్ణయించింది.
తొలగింపుపై నస్లి వాడియా స్పందన:
తనకు అప్పగించిన పనుల్లో స్వతంత్ర అభిప్రాయాలు తీసుకుని పనిచేస్తున్నందునే తనపై వేటు వేశారని నుస్లి వాడియా ఆరోపించారు. తన తొలగింపుపై టాటా సన్స్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవిగా ఉన్నాయని వాడియా పేర్కొన్నారు. నానో మూతను జాప్యం చేయడం కంపెనీని మరింత ఆర్థిక నష్టాల్లోకి నెడుతున్నారని ఆరోపించారు. ఇది కంపెనీ పీవీబీపై మరింత నెగిటివ్ ప్రభావాన్ని చూపుతుందన్నారు.
Advertisement
Advertisement