Nusli Wadia
-
టాటాపై వాడియా కేసు వెనక్కి
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటాతో పాటు పలువురిపై దాఖలు చేసిన పరువు నష్టం కేసులను బాంబే డైయింగ్ చైర్మన్ నుస్లీ వాడియా ఉపసంహరించుకున్నారు. రూ. 3,000 కోట్ల నష్టపరిహారం దావా కూడా వీటిలో ఉంది. వాడియా ప్రతిష్టకు భంగం కలిగించే ఉద్దేశమేదీ తమకు లేదంటూ టాటా సహా మిగతా వర్గాలు న్యాయస్థానానికి తెలియజేశారు. హైకోర్టు విచారణలో కూడా ఇదే తేలినందున పరువు నష్టం దావాను ఉపసంహరించుకోవడానికి వాడియాను అనుమతిస్తూ చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే సారథ్యంలోని బెంచ్ ఉత్తర్వులు ఇచ్చింది. 2016లో టాటా గ్రూప్ కంపెనీ బోర్డుల నుంచి తనను తొలగించడాన్ని సవాల్ చేస్తూ రతన్ టాటాతో పాటు టాటా సన్స్‌లోని పలువురు డైరెక్టర్లపై వాడియా క్రిమినల్ పరువు నష్టం దావా వేశారు. దీనిపై 2018 డిసెంబర్ 15న ముంబైలోని మేజిస్ట్రేట్ కోర్టు.. టాటా, తదితరులకు నోటీసులు జారీ చేసింది. అయితే, ఆయన ప్రతిష్టకు భంగం కలిగించాలనే ఉద్దేశమేదీ లేదంటూ టాటా, తదితరులు ముంబై హైకోర్టును ఆశ్రయించగా.. వారికి అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. దీన్ని సవాల్ చేస్తూ వాడియా సుప్రీంకోర్టుకు వెళ్లారు. అయితే, ఇరు వర్గాలు కూర్చుని విభేదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలంటూ జనవరి 6న సుప్రీం కోర్టు సూచించింది. దీనికి అనుగుణంగా వాడియా తాజాగా కేసును ఉపసంహరించుకున్నారు. -
మిస్త్రీ వివాదం: వాడియా సంచలన నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: టాటా-మిస్త్రీ వివాదంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వివాదంలో టాటాపై నమోదుచేసిన క్రిమినల్ డిఫమేషన్ కేసును ఉపసంహరించుకోవాలని బాంబై డైయింగ్ చైర్మన్ నస్లీ వాడియా నిర్ణయించారు. రతన్ టాటా సహా ఇతరులపై రూ. 3వేల కోట్ల విలువైన పరువు నష్టం దావాలున్నింటిని వెనక్కి తీసుకున్నారు. దీంతో వాడియా - టాటా యుద్ధానికి తెరపడింది. పరిణతి చెందిన వ్యక్తులుగా ఇద్దరూ కేసులను పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి శరద్ అరవింద్ బొబ్డే టాటా, వాడియాలను ఇటీవల కోరారు. ఈ నేపథ్యంలోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం విశేషం. రతన్ టాటాపై పరువు నష్టం దావాను వాడియా గ్రూప్ చైర్మన్ నుస్లీ వాడియా ఉపసంహరించుకున్నారు. వాడియాపై పరువు తీసే ఉద్దేశం లేదని టాటా సుప్రీంకోర్టుకు చెప్పడంతో భారత సంతతికి చెందిన బ్రిటిష్ పార్సీ వ్యాపారవేత్త ఈ నిర్ణయం తీసుకున్నారు. టాటా సన్స్ నుంచి ఆయన మిత్రుడు మిస్త్రీకి ఉద్వాసన పలికిన అనంతరం వాడియా ఆయనకు మద్దతుగా నిలిచారు. దీంతో టాటా మోటార్స్, టాటా స్టీల్, టాటా కెమికల్స్‌లో అత్యంత సీనియర్ ఇండిపెండెంట్ డైరెక్టరుగా ఉన్న నస్లీ వాడియాను తొలగించేందుకు నిర్ణయించింది. దీంతో రూ .3,000 కోట్లు పరిహారం కోరుతో 2016 డిసెంబర్లో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఇందులో వాడియా బోర్డు సభ్యులు అజయ్ పిరమల్, రణేంద్ర సేన్, విజయ్ సింగ్, వేణు శ్రీనివాసన్, రాల్ఫ్ స్పేత్ , ఎఫ్ఎన్ సుబేదార్లతో పాటు మిస్త్రీ తరువాత వచ్చిన టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్‌ను కూడా చేర్చారు. 2019 జూలైలో బాంబే హైకోర్టు ఈ కేసును కొట్టివేయడంతో ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. కాగా, టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ తన తొలగింపుపై సూరస్ మిస్త్రీ దాఖలు చేసుకున్న కేసులో మిస్త్రీని తిరిగి నియమించాలని కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సిఎల్‌టి) ఉత్తర్వులిచ్చింది. అయితే జనవరి 10న ఈ ఉత్తర్వులను సుప్రీంకోర్టు నిలిపి వేసిన సంగతి తెలిసిందే. -
రతన్ టాటాకు నోటీసులు
సాక్షి, ముంబై : వాదియా గ్రూప్ చైర్మన్ నస్లీ వాదియా దాఖలు చేసిన పరువు నష్టం కేసులో స్ధానిక కోర్టు టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటాతో సహా ప్రస్తుత చైర్మన్ ఎన్ చంద్రశేఖర్, సంస్థకు చెందిన ఎనిమిది మంది డైరెక్టర్లకు మంగళవారం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను కోర్టు వచ్చే ఏడాది మార్చి 25కు వాయిదా వేసింది. 2016, అక్టోబర్ 24న గ్రూప్ చైర్మన్‌గా సైరస్ మిస్ర్తీని తొలగించిన తర్వాత రతన్ టాటాతో పాటు ఇతరులు తన ప్రతిష్టను కించపరిచే వ్యాఖ్యలు చేశారంటూ అదే ఏడాది వాదియా ఫిర్యాదు చేశారు. పలు టాటా సంస్థల్లో ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా బోర్డులో కొనసాగుతున్న వాదియాను 2016 డిసెంబర్ నుంచి 2017 ఫిబ్రవరి మధ్య జరిగిన ప్రత్యేక సమావేశాల్లో వాటాదారులు తొలగించారు. మిస్ర్తీతో కలిసి వాదియా టాటా గ్రూప్ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేశారని నిందితులు ఆరోపించారని వాదియా తరపు న్యాయవాది అబద్ పోండా మెట్రపాలిటన్ మేజిస్ర్టేట్ కోర్టుకు వివరించారు. అయితే నస్లీ వాదియాను ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా తొలగించడంలో చట్టబద్ధమైన ప్రక్రియలను అన్నింటినీ చేపట్టామని టాటా సన్స్ ప్రతినిధి పేర్కొన్నారు. -
నస్లీ వాడియాకు టాటా స్టీల్ గుడ్ బై
-
నస్లీ వాడియాకు టాటా స్టీల్ గుడ్ బై
టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి అర్థాంతరంగా తప్పించిన సైరస్ మిస్త్రీకి మద్దతుగా నిలుస్తున్నారనే నెపంతో ప్రముఖ పారిశ్రామిక వేత్త నస్లీ వాడియాకు టాటా స్టీల్ గుడ్ బై చెప్పింది. బుధవారం జరిగిన అసాధారణ సర్వసభ్య సమావేశంలో స్వతంత్ర డైరెక్టర్‌గా ఆయనకు ఉద్వాసన పలుకుతున్నట్టు టాటా స్టీల్ వెల్లడించింది. నస్లీ వాడియాకు వ్యతిరేకంగా 90 శాతం ఓటింగ్ నమోదైనట్టు తెలిసింది. చాలామంది షేర్ హోల్డర్స్ వాడియాను తొలగించడానికే మొగ్గుచూపినట్టు బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ రెగ్యులేటరీకి టాటా స్టీల్ పేర్కొంది. తనకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ ఓటింగ్‌లో నస్లీ వాడియా పాల్గొన్నలేదు. 37 ఏళ్లుగా నస్లీ వాడియా టాటా స్టీల్ స్వతంత్ర డైరెక్టర్‌గా ఉన్నారు. చైర్మన్‌గా గ్రూప్ కంపెనీల నుంచి బయటికి గెంటివేయబడ్డ సైరస్ మిస్త్రీకి నస్లీ వాడియా మద్దతుగా నిలవడంతో పాటు టాటా గ్రూప్‌పై పలు విమర్శలు సంధించారు. దీంతో ఆగ్రహించిన టాటా సన్స్ , గ్రూపు కంపెనీల నుంచి స్వతంత్ర డైరెక్టర్ నస్లీ వాడియాను సాగనంపే ప్రక్రియను ప్రారంభించింది. స్వతంత్ర డైరెక్టర్ అయిన తనను ఈ సమావేశాల ద్వారా తొలగించే సత్తా టాటా సన్స్‌కు ఉందా? అంటూ ప్రశ్నలను సైతం ఆయన సంధించారు. ఈ నేపథ్యంలోనే బుధవారం జరిగిన ఈజీఎంలో టాటా స్టీల్ నస్లి వాడియాను కంపెనీ స్వతంత్ర డైరెక్టర్‌గా తప్పిస్తున్నట్టు నిర్ణయం తీసుకుంది. టాటా మోటార్స్, టాటా కెమెకిల్స్ కూడా ఈ వారంలో వాడియాను డైరెక్టర్‌గా తొలగించేందుకు ఈజీఎంలు నిర్వహించనున్నాయి. అయితే కంపెనీల స్వతంత్ర డైరెక్టర్‌గా తనను తొలగిస్తుండటం వివరణ కోరిన అనంతరం రతన్ టాటా, టాటా సన్స్, కొంతమంది డైరెక్టర్లపై నుస్లీ వాడియా రూ.3000 కోట్ల పరువు నష్టం దావా కూడా వేశారు. దీంతో ఇక ఆయన టాటా గ్రూప్ సంస్థల్లో ఉండటం ఏ మాత్రం మంచిది కాదని టాటా సన్స్ నిర్ణయించింది. తొలగింపుపై నస్లి వాడియా స్పందన: తనకు అప్పగించిన పనుల్లో స్వతంత్ర అభిప్రాయాలు తీసుకుని పనిచేస్తున్నందునే తనపై వేటు వేశారని నుస్లి వాడియా ఆరోపించారు. తన తొలగింపుపై టాటా సన్స్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవిగా ఉన్నాయని వాడియా పేర్కొన్నారు. నానో మూతను జాప్యం చేయడం కంపెనీని మరింత ఆర్థిక నష్టాల్లోకి నెడుతున్నారని ఆరోపించారు. ఇది కంపెనీ పీవీబీపై మరింత నెగిటివ్ ప్రభావాన్ని చూపుతుందన్నారు. -
టాటా కెమికల్స్‌కు కొనుగోళ్ల సెగ!
• పనితీరు సరిగా లేకనే నష్టాలు • తరిగిపోయిన ఇన్వెస్టర్ల సంపద • వాటాదారులకు నుస్లీ వాడియా లేఖ ముంబై: ప్రముఖ వ్యాపారవేత్త, బోంబే డైయింగ్ చైర్మన్ నుస్లీ వాడియా... టాటా కెమికల్స్ నిర్వహణ తీరును తప్పుబట్టారు. పనికిమాలిన విదేశీ ఆస్తుల కొనుగోళ్ల కారణంగా టాటా కెమికల్స్‌కు నష్టాలు పెరిగిపోయాయని,ఫలితంగా గత పదేళ్లలో సంస్థ నికర రుణ భారం రూ.8,695 కోట్లకు చేరి వాటాదారుల విలువ తరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. టాటా కెమికల్స్ బోర్డు స్వతంత్ర డైరెక్టర్‌గా ఉన్న వాడియాను, డైరెక్టర్ పదవిలోఉన్న మిస్త్రీని తప్పించేందుకు ఈ నెల 23న వాటాదారుల సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో నుస్లీ వాడియా టాటా కెమికల్స్ వాటాదారులకు లేఖ రాశారు.ఆందోళన పట్టించుకోలేదు...‘‘2005లో బ్రున్నర్ మోండ్ గ్రూపును కొనుగోలు చేసే ప్రతిపాదనపై నాతోపాటు మరికొందరు బోర్డు సభ్యులు కూడా ఆందోళన తెలిపారు. అయినప్పటికీ ఏకాభిప్రాయం మేరకు కొనుగోలు నిర్ణయం జరిగిపోయింది. సోడాయాష్ తయారీలో ఉన్న ఈ కంపెనీ కార్యకలాపాలు బ్రిటన్, కెన్యా, నెదర్లాండ్స్‌లో విస్తరించి ఉన్నాయి. దీని కొనుగోలుకు రూ.800 కోట్లు వెచ్చించారు. కొనుగోలు చేసిన స్వల్పకాలానికే లాభాల్లో ఉన్న కంపెనీ కాస్తానష్టాల్లోకి వెళ్లిపోయింది. ఫలితంగా రూ.1,600 కోట్ల నష్టాలు వాటిల్లాయి. దీంతో కంపెనీ బ్రిటన్ వ్యాపారం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోంది’’ అని వాడియా తన లేఖలో వివరించారు. టాటా కెమికల్స్ స్వతంత్రడైరెక్టర్గా తనకు మద్దతు ఇవ్వాలని వాటాదారులను వాడియా కోరారు. కంపెనీ కొనుగోళ్ల విధానాన్ని తప్పుబట్టారు. గత పదేళ్లలో కొనుగోళ్ల వల్ల కంపెనీ రుణాలు రూ.1,827 కోట్ల నుంచి రూ.8,695 కోట్లకు పెరిగాయని...అన్ని పెట్టుబడుల రూపేణా తరిగిపోయిన విలువ రూ.2,000 కోట్లుగా పేర్కొన్నారు.ఆ వాటాలను అమ్మేస్తే రుణవిముక్తి‘‘టాటా కెమికల్స్‌కు పలు టాటా గ్రూపు లిస్టెడ్, అన్‌లిస్టెడ్ కంపెనీల్లో వాటాలున్నాయి. స్టాక్ మార్కెట్లో నమోదు కాని కంపెనీల్లో వాటాల విలువ సుమారు రూ.7,200 కోట్లు. లిస్టెడ్ కంపెనీల్లో వాటాల విలువ రూ.1,300కోట్లు కంటే ఎక్కువ. మొత్తం రూ.8,500 కోట్లు. ఈ వాటాలన్నీ అమ్మేస్తే టాటా కెమికల్స్ రుణాలన్నీ తీరిపోతాయి. రుణ భారాన్ని మోస్తున్న కంపెనీ ఈ వాటాలను కలిగి ఉండడం కేవలం పరోక్షంగా టాటా సన్స్ ఓటింగ్హక్కులు, నియంత్రణను కాపాడేందుకే ’’ అని వాడియా పేర్కొన్నారు.నాపై ఆరోపణలు అవాస్తవం: కంపెనీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యహరించానని టాటా సన్స్ తనపై చేసిన ఆరోపణలు నిరాధారం, అసత్యంగా పేర్కొన్నారు. టాటా కెమికల్స్‌లో స్వతంత్ర డైరెక్టర్‌గా 35 ఏళ్లుగా ఉన్నాననివాడియా తెలిపారు. -
నస్లీ వాడియాతో టాటాలు బ్రేక్ అప్
ముంబై : దశాబ్దాల తరబడి కొనసాగుతున్న టాటా, వాడియాల స్నేహం ఇక బీటలు వారబోతోంది. టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని అర్థాంతరంగా తొలగించిన వివాదం నన్లీ వాడియా, రతన్ టాటాల స్నేహం తెగదెంపుల స్థాయికి వెళ్లింది. నెస్లీ వాడియా, మిస్త్రీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నాడనే నెపంతో మూడు గ్రూప్ కంపెనీలకు బోర్డు సభ్యుడిగా వ్యవహరిస్తున్న వాడియాను తొలగించాలని టాటాలు పావులు కదుపుతున్నారు. చరిత్రలో అతిపెద్ద కార్పొరేట్ వార్‌గా పేరుగాంచిన టాటా గ్రూప్ వివాదంపై వాడియా కుటుంబసభ్యులు, టాటాలకు వ్యతిరేకమై, సైరస్ మిస్త్రీకి అనుకూలంగా నిలిచారు. కంపెనీ చైర్మన్‌గా మిస్త్రీనే ఉంచాలని మద్దతుపలుకుతూ టాటా కెమెకిల్స్ సీనియర్ స్వతంత్ర డైరెక్టర్ వాడియా తన నిర్ణయం తెలిపారు. దీంతో ఆగ్రహం వ్యక్తంచేసిన టాటా సన్స్, టాటా కెమికల్స్‌కు, టాటా స్టీల్‌కు, టాటా మోటార్స్‌కు శుక్రవారం నోటీసులు జారీచేసింది. వాడియాను బోర్డుల నుంచి తొలగించాలని ఆదేశించింది. టాటా గ్రూప్ ఆదేశాలతో టాటా స్టీల్ శుక్రవారం బోర్డు సమావేశం జరిగింది. ఆ సమావేశంలోనూ వాడియా మళ్లీ మిస్త్రీకే అనుకూలంగా నిలిచారు. కాగ, టాటా మోటార్స్ బోర్డు మీటింగ్ నేడు జరుగనుంది. 1981 నుంచి వాడియా, టాటా కెమికల్స్ బోర్డులో స్వతంత్ర డైరెక్టర్‌గా బాధ్యతలు చేపడుతూ వస్తున్నారు. 1979 ఆగస్టు నుంచి టాటా స్టీల్ బోర్డులో, 1998 డిసెంబర్ నుంచి టాటా మోటార్స్ బోర్డులో కొనసాగున్నారు. శుక్రవారం జారీచేసిన ఆదేశాలతో, ఈ మూడు కంపెనీలు వాడియాను డైరెక్టర్‌షిప్ నుంచి తొలగించడానికి అసాధారణ బోర్డు సమావేశాలకు పిలుపునిచ్చాయి. కాగ, వాడియాను డైర్టకర్షిప్ నుంచి తొలగించాలంటే, ఆ కంపెనీల షేర్ హోల్డర్స్ నుంచి టాటా సన్స్ మెజార్జీ సపోర్టును పొందాల్సి ఉంటుందని వాదనలు వినిపిస్తున్నాయి. అయితే తన తొలగింపుపై టాటా సన్స్ కదుపుతున్న పావులపై వాడియా మండిపడ్డారు. బోర్డుల నుంచి తనను తొలగించడం అసమంజసమని, దశాబ్దాలుగా బోర్డులో సభ్యుడిగా నిర్వహిస్తున్న తనను తొలగించాలంటే, కచ్చితమైన వివరణ ఇవ్వాల్సి ఉంటుందని వాడియా పేర్కొన్నారు. ఈ వార్‌లో మిస్త్రీ, వాడియాలు ఓ వైపు ఉండగా.. రతన్ టాటా మరోవైపు ఉన్నారని, ఈ పోరు మరింత రసవత్తరంగా మారనుందని టాటా గ్రూప్‌లో ఓ ప్రముఖ సభ్యుడు వ్యాఖ్యానించారు. తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో అని ఆశ్చర్యం వ్యక్తంచేశారు. -
వాడియా తండ్రికి రవి పూజారి బెదిరింపులు
ముంబై: అండర్ వరల్డ్ డాన్ రవి పూజారి నుంచి మొబైల్ ఫోన్ కు బెదిరింపు మెసేజ్ లు వస్తున్నాయని వాడియా గ్రూప్ చేసిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ముంబై డిప్యూటి పోలీస్ కమిషనర్ మహేశ్ పటేల్ తెలిపారు. రవి పూజారి నుంచి బెదిరింపు మెసెజ్ వస్తున్నట్టు పారిశ్రామిక వేత్త నుస్లీ వాడియా కార్యదర్శి ఎన్ఎమ్ జోషి మార్గ్ పోలీస్ స్టేషన్ లో నిన్న ఫిర్యాదు చేసినట్టు మహేశ్ పటేల్ చెప్పారు. నెస్లీ వాడియా కార్యదర్శి పేరు చెప్పడానికి పోలీసులు నిరాకరించారు. అయితే నెస్లీ వాడియా ఫోన్ కు వచ్చాయా లేక కార్యదర్శి మొబైల్ వచ్చాయా అనే విషయాన్ని పోలీసులు ధృవీకరించలేదు. నెస్లీవాడియా కుమారుడు నెస్ వాడియాపై బాలీవుడ్ నటి, మాజీ ప్రేయసి ప్రీతి జింటా మే 30 తేదిన ఐపీఎల్ మ్యాచ్ సందర్బంగా లైంగికంగా వేధించారని ఫిర్యాదు చేయడంతో వాడియా కుటుంబ పేరు మీడియాలో వినిపిస్తోంది. నెస్ వాడియా, ప్రీతి జింటాలకు కేసు నేపథ్యంలో బెదిరింపులు వచ్చాయా అనే విషయంపై ఓ అవగాహనకు రాలేదని పోలీసులు తెలిపారు. తాజా ఫిర్యాదుపై వాడియా గ్రూప్ ప్రతినిధులు స్పందించడానికి అందుబాటులోకి రానట్టు తెలుస్తోంది.