నోట్ల రద్దయినా ఆ వసూళ్లు పెరిగాయ్!
నోట్ల రద్దయినా ఆ వసూళ్లు పెరిగాయ్!
Published Mon, Jan 9 2017 1:42 PM | Last Updated on Tue, Oct 2 2018 4:19 PM
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఉన్నప్పటికీ పన్ను వసూళ్లు బాగానే పెరిగాయట. గతేడాది కంటే 2016 ఏప్రిల్-నవంబర్ కాలంలో ప్రత్యక్ష పన్నులు 12.01 శాతం, పరోక్ష పన్ను వసూళ్లు 25 శాతం పెరిగినట్టు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పన్ను వసూళ్ల గణాంకాలను వెల్లడించారు. పన్ను వసూళ్లు తగ్గిపోతాయంటూ భయాందోళనలు వ్యక్తంచేస్తూ వచ్చిన రిపోర్టులు, గణాంకాలను ఆయన కొట్టిపారేశారు. తాను వెల్లడించిన గణాంకాలు అసలైనవిగా చెప్పారు. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సైతం పన్ను వసూలపై ఎలాంటి ఆందోళన చెందాల్సినవసరం లేదని తెలిపినట్టు జైట్లీ పేర్కొన్నారు.
మొత్తంగా 2016 ఏప్రిల్-నవంబర్ కాలంలో పన్ను వసూళ్లు పెరిగినట్టు పేర్కొన్నారు. అదేవిధంగా కేంద్ర ఎక్స్చేంజ్ ట్యాక్స్ వసూళ్లు 43 శాతం, సర్వీసు ట్యాక్స్ 23.9 శాతం, కస్టమ్ డ్యూటీ పన్ను వసూళ్లు 4.1 శాతం ఎగిసినట్టు వెల్లడించారు. ప్రాథమిక రిపోర్టుల ప్రకారం 2016 డిసెంబర్లో పరోక్ష పన్నులు గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 14.2 శాతం పెరిగాయట. నగదు కొరత, పెద్ద నోట్ల రద్దు ఉన్నప్పటికీ పన్ను వసూళ్లు మంచిగానే నమోదైనట్టు ప్రభుత్వం పేర్కొంది. అయితే డిసెంబర్ నెలలో కస్టమ్ డ్యూటీ ట్యాక్స్ గతేడాది కంటే 6.3 శాతం పడిపోయింది. బంగారం దిగుమతులు పడిపోవడంతో ఇవి తగ్గాయని జైట్లీ చెప్పారు.
Advertisement
Advertisement