
7లక్షల మందికి ఐటీశాఖ నోటీసులు!
న్యూఢిల్లీ : పన్ను ఎగవేత తనిఖీ నేపథ్యంలో ఏడు లక్షల మంది పన్నుచెల్లింపుదారులకు ఆదాయపు పన్ను విభాగం నోటీసుల జారీ చేసింది. ఈ నోటీసుల జారీ ద్వారా అధిక విలువ కల్గిన లావాదేవీలు లేదా బ్యాంకు సేవింగ్స్ ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్లు ఉన్న పన్ను చెల్లింపుదారుల పాన్ వివరాలను ఆదాయపు పన్ను విభాగం సేకరించనుంది. ఈ లావాదేవీలకు సంబంధించిన చాలా మంది పన్ను చెల్లింపుదారుల పాన్ వివరాలు ఐటీ డిపార్ట్ మెంట్ లో నమోదై లేవని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ తాజా నోటీసులతో వారి పాన్ వివరాలను ఐటీ విభాగం సేకరించనుంది. బ్లాక్ మనీని నిరోధించడంలోనూ, పన్ను ఎగవేతదారులను కనుగోవడంలోనూ పది అంకెల పాన్ నెంబర్ చాలా కీలకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నెంబర్ తోనే పన్నుఎగవేతదారులను ఐటీ డిపార్ట్ మెంట్ గుర్తిస్తోంది.
అధిక విలువ కల్గిన లావాదేవీల వివరాలు ఐటీ డిపార్ట్ మెంట్ వద్ద నమోదవుతాయి. సేవింగ్స్ ఖాతాల్లో నగదు డిపాజిట్ లు రూ.10లక్షల కంటే ఎక్కువ ఉన్నవారు, రూ.30లక్షలకంటే ఎక్కువ మొత్తంలో కొనుగోలు/ అమ్మకం నిర్వర్తించేవారి ఈ లావాదేవీ వివరాలు రికార్డు అయి ఉంటాయి. కానీ ఈ లావాదేవీలకు సంబంధించి చాలా మంది పాన్ వివరాలు ఐటీ విభాగం వద్ద లేవని ఆర్థిక శాఖ వెల్లడించింది.
ఇన్-హోస్ కంప్యూటర్ టెక్నిక్ తో 14లక్షల నాన్-పాన్ లావాదేవీల వివరాలను ఐటీ డిపార్ట్ మెంట్ సేకరించింది. వీరిలో 7లక్షల మందిని అత్యంత ప్రమాదకరమైన గ్రూపుగా ఐటీ డిపార్ట్ మెంట్ గుర్తించింది. నోటీసులు పొందిన వ్యక్తుల సౌలభ్యానికి ఈ-ఫైలింగ్ పోర్టల్ ను ఐటీ విభాగం డెవలప్ చేసింది. లెటర్ అందిన వ్యక్తులు తమ పాన్ నెంబర్ ను ఎలక్ట్రిక్ గా కూడా నమోదుచేసుకునే సౌకర్యాన్ని అందించింది. ఈ-ఫైలింగ్ వెబ్ సైట్ లోకి పార్టీలు లాగిన్ అయి, లెటర్లో పంపిన ప్రత్యేక లావాదేవీ సంఖ్యతో, వారి లావాదేవీని పాన్ కార్డుతో తేలికగా లింక్ చేసుకోవచ్చు.