పన్ను సంస్కరణలకు ఓఈసీడీ చర్యలు
లండన్: బహుళజాతి సంస్థలకు వర్తించే అంతర్జాతీయ పన్ను విధానాల్లో సంస్కరణలకు సంబంధించి తుది కార్యాచరణ ప్రణాళికను ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (ఓఈసీడీ) ఆవిష్కరించింది. కంపెనీల లాభాల మళ్లింపు (బీఈపీఎస్) తదితర అంశాల కారణంగా ఏటా ప్రపంచ దేశాల ఖజానాలకు 100-240 బిలియన్ డాలర్ల మేర పన్నుల ఆదాయపర ంగా నష్టం వాటిల్లుతోందని అంచనా వేసింది.
అంతర్జాతీయంగా కార్పొరేట్ ఆదాయ పన్నుల (సీఐటీ) ద్వారా వసూలయ్యే మొత్తంలో ఇది 4-10 శాతం మేర ఉంటుందని పేర్కొంది. పన్ను ఎగవేతలు, అక్రమ మార్గాల్లో నిధుల ప్రవాహాన్ని అరికట్టేందుకు భారత్ సహా ప్రపంచ దేశాలు మల్లగుల్లాలు పడుతున్న నేపథ్యంలో ఓఈసీడీ పన్నులపరమైన ప్రమాణాలను ఆవిష్కరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నెల 8న పెరూలో జరగబోయే జీ20 దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంకు గవర్నర్ల సమావేశంలో కొత్త ప్రమాణాలను చర్చించనున్నారు.