బై బ్యాక్ కు టీసీఎస్ బోర్డు ఓకే
ముంబై: ప్రముఖ దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్)వాటాదారులకు ఉత్సాహకరమైన వార్త అందించింది. అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న షేర్ల బై బ్యాక్ పై టీసీఎస్ బోర్డు నిర్ణయం తీసుకుంది. 5.6 కోట్ల ఈక్విటీ షేర్లను రూ.16 వేల కోట్ల విలువకు మించకుండా తిరిగి కొనుగోలు చేసేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. సోమవారం జరిగిన టీసీఎస్ బోర్డ్ సమావేశంలో బై బ్యాక్ ప్రతిపాదనను పరిశీలించింది. 14.6 శాతం ప్రీమియంతో తన సొంత షేర్ల కొనుగోలుకు నిర‍్ణయం తీసుకుంది. ప్రస్తుత మార్కెట్ రేటు పై ఈ ప్రీమియాన్ని అందించనుంది.
రూ.2,850 ధర వద్ద షేరును కొనుగోలు చేయనున‍్నట్టు స్టాక్ ఎక్సేంజ్ ఫైలింగ్ లో టీసీఎస్ తెలిపింది. టెండర్ ఆఫర్ ద్వారా బైబ్యాక్‌ను చేపట్టనున్నట్లు వెల్లడించింది. కంపెనీలో ప్రమోటర్ల వాటా 73.33 శాతంగా ఉంది. ఈ వార్తలతో మార్కెట్ ముగింపులో టీసీఎస్ కౌంటర్‌కు డిమాండ్ పుట్టింది. అటు టీసీఎస్ నిర్ణయంపై మార్కెట్ వర్గాలు హర్షం ప్రకటించాయి.