
అప్పటి నుంచే నన్ను దూరంగా పెట్టారు
సినీ నటి కవిత కన్నీటి పర్యంతం
మహానాడు వేదికపైకి తనను పిలవకపోవడంపై తీవ్ర ఆవేదన
కరివేపాకులా తీసిపడేశారని ఆక్రోశం
సాక్షి, విశాఖపట్నం: ‘‘తెలుగుదేశం పార్టీలో మహిళలకు కనీస గౌరవం లేదు.. సినిమా వాళ్లంటే మరీ చిన్నచూపు.. గడిచిన మూడేళ్లుగా ఎన్నో అవమానాలకు గురిచేశారు.. చేస్తున్నారు.. చాలా క్షోభపెట్టారు. ఇలాంటి పార్టీలో ఎందుకు కొనసాగాలో మీరే చెప్పండి’’ అని టీడీపీ ఆర్గనైజింగ్ కార్యదర్శి, సినీ నటి కవిత కన్నీటి పర్యంతమయ్యారు చేశారు. మహానాడు వేదికపైకి తనను పిలవకుండా అవమానించడం పట్ల మీడియా వద్ద ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.
‘‘అపోజిషన్‌లో ఉన్నప్పుడు నన్ను డయాస్‌పైకి పిలిచేవారు. పార్టీ పవర్‌లోకి వచ్చిన రోజు నుంచే నన్ను దూరంగా పెట్టారు. డయాస్‌పై కూర్చోడానికి వీల్లేదన్నారు. 2015 మహానాడులోనే ఇలాంటి అవమానం జరిగింది. గతేడాది తిరుపతి మహానాడుకు రాలేదు. ఇప్పుడూ రాకూడదనే అనుకున్నా. ఎమ్మెల్యే అనిత రమ్మని ఆహ్వానించారు. స్టేజీపైన వాళ్లంతా కవిత కిందనే కూర్చోవాలని.. పైకి పిలవడానికి వీల్లేదని కరాఖండీగా చెప్పారు. చంద్రబాబు సీఎం కావాలని ఫ్యామిలీని, పిల్లల్ని వదిలేసి నెలల తరబడి రేయింబవళ్లు పార్టీకోసం పనిచేశా. కానీ ఈరోజు కరివేపాకు కంటే హీనంగా ట్రీట్ చేస్తున్నారు. ఇంటికెళ్లి నా అనుచరులు, కార్యకర్తలతో చర్చించి భవిష్యత్‌పై నిర్ణయం తీసుకుంటా’’ అని కవిత చెప్పారు.