
‘‘సారంగపాణి జాతకం’లో నేను చేసిన పాత్ర, ఈ చిత్రం అందరికీ నచ్చుతాయని భావిస్తున్నాను. నేను నటించిన ‘మల్లేశం’, ‘బలగం’, ‘కోర్ట్’ సినిమాల తరహా భావోద్వేగాలతో సాగే ఓ సాధారణ వ్యక్తి కథే ‘సారంగపాణి జాతకం’’ అన్నారు ప్రియదర్శి. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ప్రియదర్శి, రూపా కొడువాయూర్ జంటగా నటించిన చిత్రం ‘సారంగపాణి జాతకం’. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రియదర్శి పంచుకున్న విశేషాలు.
⇒ ఇంద్రగంటిగారితో ఒక ఫొటో దిగితే చాలనుకునేవాణ్ణి. అలాంటిది ఆయనే నన్ను పిలిచి, ‘సారంగపాణి జాతకం’ కథ చెప్పారు. ఆయనతో నా ఫస్ట్ డే షూటింగ్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ చిత్రం కోసం ఇంద్రగంటిగారే ఎక్కువగా కష్టపడ్డారు. నేను ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేశానంతే. ఇంతవరకు నేనెక్కువగా తెలంగాణ మాండలికం మాట్లాడాను. కానీ, ఈ సినిమాలో ఆంధ్ర యాసలో మాట్లాడాను.
⇒ జాతకాలని నమ్మాలని కానీ, నమ్మకూడదని కానీ మా సినిమాలో చెప్పడం లేదు. ఒకరి నమ్మకాల్ని ఇంకొకరి మీద రుద్దితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో చూపిస్తున్నాం. ఇండస్ట్రీలోకి రాకముందు నా జాతకాలు చూపిస్తే.. ‘అస్సలు యాక్టర్ కాలేవు’ అని చెప్పారు. కానీ నేను అవన్నీ పట్టించుకోలేదు. నా పైన, చేసే పని మీద నమ్మకం పెట్టుకుని ఇండస్ట్రీకి వచ్చాను.
⇒ శివలెంక కృష్ణ ప్రసాద్‌గారు గొప్ప నిర్మాత. అప్పట్లోనే ‘ఆదిత్య 369’ లాంటి గొప్ప చిత్రాన్ని నిర్మించారాయన. ఇప్పటికీ నాలాంటి కొత్త యాక్టర్‌లని కూడా సార్ అని పిలుస్తుంటారు. ఆయన బ్యానర్‌లో పని చేసే చాన్స్ రావడం నా అదృష్టం. ప్రస్తుతం ఆడియన్స్ ఏ సినిమా చూడాలో... చూడకూడదో ఫుల్ క్లారిటీతో ఉన్నారు. సినిమాలో విషయం ఉంటేనే థియేటర్లకు వస్తున్నారు. కామన్ మేన్ పాత్రల్ని పోషిస్తే ఎక్కువమందికి రీచ్ అవుతుందని నా నమ్మకం. ప్రస్తుతం ‘ప్రేమంటే, మిత్ర మండలి’ సినిమాలు చేస్తున్నాను. మరికొన్ని కథలు వింటున్నాను.