
'నీచ ప్రవృత్తి బయటపడింది'
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన దీక్షను భగ్నం చేయడంతో టీడీపీ ప్రభుత్వ నీచ ప్రవృత్తి బయటపడిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పార్థసారథి విమర్శించారు. వైఎస్ జగన్ ఆరోగ్యం విషయంలో నిన్నటి వరకు తమతో పాటు.. రాష్ట్రంలో ప్రజలంతా కూడా ఆందోళన చెందారని ఆయన అన్నారు. రాష్ట్ర యువత భవిష్యత్తు కోసం పోరాటం చేస్తుంటే దాన్ని ఎలా భగ్నం చేయాలా అని రాజకీయ కోణంలోనే టీడీపీ ప్రభుత్వ పెద్దలు ఆలోచించారని మండిపడ్డారు. ఈ రాష్ట్రానికి టీడీపీ అన్యాయం చేసిందన్నారు.
ప్రభుత్వం భగ్నం చేసినా కూడా వైఎస్ జగన్ చేపట్టిన దీక్ష విజయవంతం అయిందనడంలో ఎలాంటి సందేహం లేదని ఆయన తెలిపారు. దీని ఫలితంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి వచ్చిందని స్పష్టం చేశారు. ఈ అంశాన్ని టీడీపీ నేపతలు ఉద్దేశపూర్వకంగా మరుగున పరుస్తున్నారన్నది స్పష్టంగా అందరికీ తెలిసిందని, జగన్ దీక్షతో ఈ విషయం మొత్తం ప్రజల్లోకి వెళ్లిందని పార్థసారథి అన్నారు. ఇక ఉద్యమాన్ని ఎలా కొనసాగించాలో, ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో నిర్ణయించేందుకు ఉదయం 11 గంటలకు పార్టీ సీనియర్ నాయకుల సమావేశం ఉందని, అందులో చర్చించి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని వివరించారు.