హామీల నుంచి తప్పించుకునే ప్రయత్నం
ఎన్నికల హామీల నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి అన్నారు. చంద్రబాబు తన అనుభవంతో లక్ష కోట్ల వ్యవసాయ రుణాలను 45 వేల కోట్లకు తగ్గించారని ఆయన ఎద్దేవా చేశారు. ఇక ఆర్థికమంత్రి యనమల 45 వేల కోట్లను ఏకంగా 5వేల కోట్లకు కుదించారని మండిపడ్డారు.
చంద్రబాబుది రోజుకో మాట..పూటకో కమిటీ అని పార్థసారథి విమర్శించారు. ఇప్పుడు మళ్లీ కొత్తగా రుణమాఫీకి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామంటూ డ్రామా ఆడుతున్నారన్నారు. చంద్రబాబు హైటెక్ పోకడలు ఇంకా వదులుకోలేదని, ప్రతిరోజూ హైటెక్, కంప్యూటర్లు, స్మార్ట్ సిటీలు అనే అంటున్నారని తెలిపారు. వాస్తవానికి ఇప్పుడు కావల్సింది స్మార్ సిటీలు కాదు, స్మార్ట్ విలేజీలని ఆయన అన్నారు.