వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం మొదటినుంచి పోరాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు టీడీపీకి లేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారథి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్సార్‌సీపీ కేంద్రంపై పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతిస్తామని చెప్పిన టీడీపీ మాట మార్చి తామే అవిశ్వాసాన్ని ప్రవేశపెడతామంటోందని విమర్శించారు.
అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో ప్రత్యేక హోదా అంశంపై ఇతర పార్టీల మద్దతు కూడగట్టి కేంద్రంపై ఎందుకు పోరాటం చేయలేదని చంద్రబాబును నిలదీశారు. అవిశ్వాసంపై జాతీయస్థాయిలో వైఎస్సార్‌సీపీకి వస్తున్న మద్దతు చూసి చంద్రబాబు ఒత్తిడికి గురవుతున్నారని అన్నారు. వైఎస్ జగన్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
మానవహారాలు నిర్వహిస్తాం..
పార్లమెంట్‌లో వైఎస్సార్‌సీపీ ఎంపీల పోరాటానికి మద్దతుగా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో సోమవారం మానవహారాలు నిర్వహిస్తామని వెల్లడించారు. అభద్రతాభావంతో టీడీపీ వైసీపీపై విమర్శలు చేస్తోందని మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు జగన్‌పై వ్యక్తిగత విమర్శలకు దిగడం.. ఆయనకు ఇంగిత జ్ఞానం లేదనే విషయం తెలుపుతుందన్నారు.
మోదీ సమాధానం చెప్పాలి..
కోర్టులకు హాజరు కాకుండా స్టేలు తెచ్చుకునే రాజకీయ నేరగాడు చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. అలాంటి నాయకుడిని ప్రధాని మోదీ ఎందుకు పక్కన సహించాడో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘దళిత మహిళను వివస్త్రను చేసిన నీ పాలనలో శాంతిభద్రతలు ఎక్కడున్నాయ’ని పార్థసారథి ప్రశ్నించారు. దోపీడీలు, మట్టి, ఇసుక అక్రమ రవాణా, కాంట్రాక్టుల్లో అవినీతితో రాష్ట్రాన్ని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపారని మండిపడ్డారు. నాడు కేంద్రం ప్యాకేజీపై పొగడ్తలు గుప్పించి.. ఇప్పుడు అసెంబ్లీలో కేంద్రం సహాయం చేయడం లేదంటూ మొసలికన్నీరు కార్చడం చంద్రబాబుకే సాధ్యం అని అన్నారు.
ఎన్టీఆర్‌ను ముంచాడు..మామను వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీని, అధికారాన్ని, గుర్తుని, నిధులను లాక్కున్న చంద్రబాబుది దొంగల పార్టీ అని తీవ్రంగా విమర్శించారు. ప్రజలు తరిమికొడతారన్న భయంతో ఎన్డీయే నుంచి టీడీపీ బయటికొచ్చిందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment