
సెక్స్ రాకెట్ నిందితుడితో మోదీ ఫొటో!
పట్నా: జర్నలిస్టు హత్య కేసులో నిందితుడైన షార్ప్ షూటర్ మహమ్మద్ ఖైఫీతో లాలూ తనయుడు, బిహార్ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ దిగిన ఫొటో బిహార్‌లో పెద్ద దుమారం రేపుతోంది. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.
మహమ్మద్ ఖైఫీ ఇటీవల జైలు నుంచి విడుదలైన ఆర్జేడీ మాజీ ఎంపీ షాహబుద్దీన్ అనుచరుడు. సివాన్ పాత్రికేయుడైన రాజ్‌దేవ్ రంజన్ హత్యకేసులో నిందితుడిగా ఉన్న ఖైఫీతో తేజ్‌ప్రతాప్ ఉన్న ఫొటో వెలుగుచూడటం నితీశ్ సర్కార్‌ను ఇరకాటంలో పడేసింది. ఇప్పటికే షాహబుద్దీన్ విడుదలపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న నితీశ్ సర్కారు.. తాజాగా ఈ ఫొటోతో మరింతగా ఇరకాటంలో పడింది.
మరోవైపు లాలూ తనయుడు తేజ్ ప్రతాప్ తనపై విమర్శలు గుప్పిస్తున్న బీజేపీపై ఎదురుదాడి ప్రారంభించారు. సెక్స్ రాకెట్ నిందితుడు అయిన టీనూ జైన్ గతంలో ప్రధాని నరేంద్రమోదీతో ఫొటోలు దిగారని పేర్కొంటూ వాటిని విడుదల చేశారు. ఖైఫీతో ఫొటో విషయంలో తన రాజీనామా అడుగుతున్న వారు మొదట ప్రధాని మోదీతో రాజీనామా చేయించాలని తన ఫేస్‌బుక్ పోస్టులో డిమాండ్ చేశారు. తాను రాజకీయ నాయకుడినని, తనతో చాలామంది ఫొటోలు దిగుతారని, అంతమాత్రాన తనతో వారికి సంబంధం ఉందని పేర్కొనడం సరికాదని పేర్కొన్నారు.