ఏపీ భవన్‌లో జేపీపై దాడి
కాలర్ పట్టుకుని లాగేందుకు యత్నం
ప్రెస్‌మీట్ అనంతరం చుట్టుముట్టిన టీ న్యాయవాదులు
అదేసమయంలో అక్కడికి వచ్చిన ఓయూ జేఏసీ విద్యార్థులు
రక్షణ వలయంతో ఏపీభవన్ లోపలికి తీసుకెళ్లిన పోలీసులు
దాడికి నిరసనగా నేడు అంబేద్కర్ విగ్రహాలవద్ద ధర్నాలు
సాక్షి, న్యూఢిల్లీ/ హైదరాబాద్: లోక్‌సత్తా నేత డాక్టర్ జయప్రకాశ్ నారాయణ(జేపీ)పై తెలంగాణ న్యాయవాదుల జేఏసీ, ఓయూ జేఏసీకి చెందిన నేతలు మంగళవారం ఇక్కడి ఆంధ్రప్రదేశ్ భవన్‌లో దాడికి దిగారు. కాలర్ పట్టుకుని లాగేందుకు ప్రయత్నించారు. సాయంత్రం నాలుగు గంటలకు ఏపీ భవన్ ఆవరణలో జేపీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా తమ పార్టీకి చెందిన ఉపాధ్యక్షుడు బాబ్జీ, వర్కింగ్ కమిటీ సభ్యురాలు గీతామూర్తి, కర్నూలు జిల్లా ఉపాధ్యక్షుడు మాజిద్‌లను మీడియాకు పరిచయం చేశారు.
ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ... లోక్‌సత్తా సూచించిన రోడ్‌మ్యాప్‌నకు అనుగుణంగా రాష్ట్రవిభజన చేస్తామన్న కేంద్రం కేవలం రెండు సూచనలనే స్వీకరించిందని, అన్ని ప్రాంతాలు సంతృప్తికరంగా ఉండేలా కేంద్రం వ్యవహరించాలని చెప్పారు. పరిసరాల్లో ఉన్న తెలంగాణ అడ్వకేట్ జేఏసీ నాయకులు జేపీ సమావేశం ముగించబోతున్న తరుణంలో ఒక్కసారిగా జై తెలంగాణ.. జేపీ డౌన్‌డౌన్.. జేపీ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఇదేసమయంలో ఏపీభవన్ ఆవరణలోకి వచ్చిన ఓయూ జేఏసీ నేతలు వారికి తోడయ్యారు. అందరూ కలిసి జేపీని చుట్టుముట్టారు. ఒక ఆందోళనకారుడు జేపీ గల్లాపట్టుకుని లాగేందుకు ప్రయత్నించబోగా.. జేపీ వారించారు.
అక్కడే ఉన్న పోలీసులు ఆందోళనకారులను లాగేసి, ఎట్టకేలకు జేపీని సురక్షితంగా ఏపీ భవన్‌లోకి తీసుకెళ్లారు. జేపీపై దాడికి నిరసనగా ఆ పార్టీ కార్యకర్తలు కొందరు హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌వద్దనున్న అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన వ్యక్తంచేశారు. దాడుల్లాంటి అప్రజాస్వామిక, పెడధోరణుల వల్లే తెలంగాణ అంశం ఇప్పటిదాకా పరిష్కారం కాకుండా పీటముడి పడిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కటారి శ్రీనివాసరావు చెప్పారు. దాడిని ఖండిస్తూ బుధవారం రాష్ట్రవ్యాప్తంగా లోక్‌సత్తా పార్టీ శ్రేణులు అంబేద్కర్ విగ్రహాల వద్ద ధర్నాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
సంయమనం పాటించండి: కోదండరాం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చివరిదశకు చేరుకున్న తరుణంలో ఎవరూ ఉద్రేకాలకు లోనుకావొద్దని.. సంయమనంతో వ్యవహరించాలని తెలంగాణ రాజకీయ జేఏసీ ైచె ర్మన్ కోదండరాం సూచించారు. తెలంగాణ ఉద్యమం ఎంతో గొప్పదని.. అనవసర ఉద్రేకాలతో దానిని చెడగొట్టవద్దని కోరారు. మంగళవారం ఆయన ఢిల్లీలోని ఏపీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. విధానాలపైనే వ్యతిరేకత వ్యక్తం చేయాలిగానీ, వ్యక్తులపై కాదని జేపీపై జరిగిన దాడి ఘటనను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆ సంఘటన పట్ల చింతిస్తున్నామన్నారు.