న్యూఢిల్లీ : తెలంగాణ బిల్లు మరింత ఆలస్యం కానుంది. ఈరోజు కేంద్ర కేబినెట్ తెలంగాణ బిల్లును ఆమోదించి అనంతరం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపనుంది. అయితే రాష్ట్రపతి రేపటి నుంచి మూడు రోజుల పాటు పశ్చిమ బెంగాల్ పర్యటనకు వెళ్లనున్నారు. తిరిగి ఆయన 8వ తేదీ ఢిల్లీ రానున్నారు.
ఈ నేపథ్యంలో ... కేంద్ర కేబినెట్ తెలంగాణ బిల్లు ఆమోదించి రాష్ట్రపతికి పంపటం... ఆ తరువాత రాష్ట్రపతి దానిని శాసనసభకు పంపడం - అనంతరం శాసనసభ అభిప్రాయం రాష్ట్రపతికి పంపే ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. ఈ ప్రక్రియ మొత్తాన్ని ముగించుకుని తెలంగాణ బిల్లు పార్లమెంటుకు చేరుకోవాల్సి ఉంది. మొత్తంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ 20 నుంచి 40 రోజుల సమయం తీసుకుంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
అయితే శీతాకాల సమావేశాల్లో బిల్లు వస్తుందా? అన్నది ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. ప్రభుత్వం మొన్నటిదాకా శీతాకాల సమావేశాల్లోనే బిల్లు వస్తుందని స్పష్టం చేసినా.. గత రెండు రోజుల నుంచి సాధ్యమైనంత త్వరలో బిల్లును సమావేశాల్లో ప్రవేశపెడతామని, లేని పక్షంలో ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేస్తామని ఢిల్లీ పెద్దలు చెబుతున్నారు.