జీవోఎంతో తెలంగాణ కేంద్ర మంత్రుల సమావేశం
న్యూఢిల్లీ : తెలంగాణ కేంద్ర మంత్రుల బృందం సోమవారం జీవోఎంతో భేటీ అయ్యారు. ఈ భేటీలో జైపాల్ రెడ్డి, సర్వే సత్యనారాయణ, బలరాం నాయక్ పాల్గొన్నారు. అంతకు ముందు జీవోఎంతో భేటీ అవుతున్న నేపథ్యంలో.. ఆ కమిటీ ఎదుట ప్రతిపాదించాల్సిన అంశాలపై కాంగ్రెస్ తెలంగాణ నేతలు కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి నివాసంలో ఈరోజు ఉదయం మరోసారి సమావేశమై నివేదికకు తుది మెరుగులు దిద్దారు.
సీడబ్ల్యూసీ నిర్ణయం మేరకు పదేళ్లపాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించినా సీమాంధ్రలో కొత్త రాజధానిని ఏడాదిలోపే నిర్మించుకునేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని తెలంగాణ కేంద్ర మంత్రులు విభజనపై జీవోఎంకు నివేదించనున్నారు. ఒకవేళ అక్కడి ప్రభుత్వం జాప్యం చేసినట్లయితే కేంద్రమే జోక్యం చేసుకుని త్వరితగతిన కొత్త రాజధానిని నిర్మించి సీమాంధ్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని అక్కడికి తరలించాలని కోరనున్నారు.