'ఆయనగారి మాటలకు, చేతలకు పొంతన లేదు'
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్తున్న నీతులు, ఆచరిస్తున్న విధానాలకు ఎక్కడా పొంతన లేదని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు. మంగళవారం హైదరాబాద్లో షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ... టీఆర్ఎస్ శిక్షణా శిబిరంలో నైతికత గురించి లెక్చర్ ఇచ్చిన కేసీఆర్.... చిత్తశుద్ధి ఉంటే పార్టీ ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలచే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ ఆస్తులపై ప్రజల్లో పలు అనుమానాలు ఉన్నాయని... వాటిని నివృత్తి చేయాలని వారు తెలంగాణ సీఎంను డిమాండ్ చేశారు.
కేసీఆర్ కుటుంబసభ్యులు రాజకీయాల్లోకి రారని, దళితుడికే సీఎం పదవి అన్న కేసీఆర్... ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని వారు విమర్శించారు. టీఆర్ఎస్ హామీలపై ప్రజలకు విశ్వాసం లేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానిది సుపరిపాలన కాదనడానికి వ్యతిరేకంగా వచ్చిన 12 కోర్టు తీర్పులే నిదర్శనం అని వారు పేర్కొన్నారు. టీఆర్ఎస్లో బంగారు తెలంగాణ X వజ్రాల తెలంగాణ నినాదం నడుస్తోందని షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్రెడ్డి అన్నారు.