
పంజాగుట్ట రోడ్డుపై కాంగ్రెస్ నేతల బైఠాయింపు
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు సీఎం క్యాంప్ ఆఫీసు వద్ద ధర్నా చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. సీఎం క్యాంప్ ఆఫీసుకు వద్దకు కాంగ్రెస్ నేతలు వెళ్తుండగా సోమాజీగూడ చౌరస్తాలో పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు వారిని అరెస్ట్ చేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం పంజాగుట్ట రోడ్డుపైనే కాంగ్రెస్ నేతలు బైఠాయించి నిరసన తెలియజేశారు. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయింది.
మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాలరాజు దాడి చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు సీఎం క్యాంప్ ఆఫీసు వద్ద నిరసన తెలిపేందుకు ప్రయత్నించారు. శనివారం సాయంత్రం రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్ను కాంగ్రెస్ నేతలు కలసి బాలరాజుపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. అనంతరం క్యాంప్ ఆఫీసుకు వెళ్తుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.