'సీమాంధ్రకు ఎంత మేలు చేసినా అడ్డు చెప్పం'
న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా నేపథ్యంలో తెలంగాణ ప్రాంత మంత్రులు, పలువురు నేతలు శుక్రవారం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించవద్దని దిగ్విజయ్ని కోరారు. భేటీ అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యే షబ్బీర్ అలీ మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చినందకు సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.
త్వరలోనే తెలంగాణలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి సోనియా, రాహుల్ను ఆహ్వానించనున్నట్లు తెలిపారు. సోనియా, రాహుల్ వల్లే తెలంగాణ సాధ్యమైందని అన్నారు. తెలంగాణ ఆవిర్భావంతో... సీమాంధ్రకు ఎంత మేలు చేసినా తాము అడ్డు చెప్పమన్నారు. సీమాంధ్ర ప్రాంతంలో కిరణ్ కుమార్ రెడ్డి వెంట ఒకరిద్దరు కూడా వెళ్లరని వ్యాఖ్యానించారు.
మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. వీరిలో డీ శ్రీనివాస్ గీతారెడ్డి, ఆమోస్ ఉన్నారు. ఈ సందర్భంగా డీఎస్ సోనియాతో పది నిమిషాలు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. కాగా సోనియాను కలిసి కృతజ్ఞతలు తెలిపేందుకు తెలంగాణ ప్రాంత నేతలు ఆమె నివాసానికి క్యూ కడుతున్నారు.