- కాంగ్రెస్ అధినేత్రితో టీ-జేఏసీ నేతలు
- మాట ఇచ్చినం.. అమలు చేసినం: సోనియా
న్యూఢిల్లీ నుండి సాక్షి ప్రత్యేకప్రతినిధి: ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం మీ వల్ల మాత్రమే సాధ్యమైంది. మీరే తెలంగాణ ప్రజలకు అమ్మ. మీకు తెలంగాణ ప్రజలు రుణపడి ఉంటరు. మీరు తీసుకున్న నిర్ణయం, అమలుకు చూపిన తెగువ మరెవరికీ సాధ్యంకాదు’ అని ఏఐసీసీ అధినేత్రి, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీకి తెలంగాణ జేఏసీ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. న్యూఢిల్లీలోని సోనియాగాంధీ నివాసంలో శుక్రవారం సాయంత్రం టీ-జేఏసీ చైర్మన్ కోదండరాం నేతృత్వంలోని బృందం కాంగ్రెస్ అధినేత్రిని కలిసి, కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ బిల్లును ఉభయసభల్లో ఆమోదించేవిధంగా కృషి చేసిం దుకు సోనియాకు పుష్పగుచ్చం అందించారు. సోనియాగాంధీ సుమారు 15 నిమిషాల పాటు మాట్లాడినట్టుగా జేఏసీ నేతలు చెప్పారు.
సమావేశంలో పాల్గొన్న నేతలు అందించిన సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ‘తెలంగాణ ప్రజల కోరికను నెరవేరుస్తానని పదేళ్ల కిందటే హామీని ఇచ్చినా. కొంచెం ఆలస్యమైనా ఇచ్చిన మాటను నిలుపుకున్నా. ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెంచడానికి, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నాం. రెండు ప్రాంతాలకు న్యాయం చేయాలని కట్టుబడి ఉన్నాం. రెండు ప్రాంతాల మధ్య వైషమ్యాలు, వైరుధ్యాల్లేకుండా అభివృద్ధి కోసం పనిచేయండి. ముందుగా మనమంతా భారతీయులం. ఆల్‌దిబెస్ట్’ అని సోనియా అభినందనలు తెలియజేశారని చెప్పారు. ‘తెలంగాణ అంటే భౌగోళిక విభజన మాత్రమే కాదు. తెలంగాణలో వెనుకబడిన, అట్టడుగు సామాజిక వర్గాలకు న్యాయం చేయాలమ్మా’ అని సోనియాను కోరినట్టు జేఏసీ నేతలు చెప్పారు. దీని గురించి ఆసక్తి చూపించిన సోనియా వివరాలను అడిగి తెలుసుకున్నారని చెప్పారు. సామాజిక న్యాయం గురించి చూసుకుంటానని ఆమె హామీ ఇచ్చారన్నారు. సోనియాను కలిసిన వారిలో జేసీనేతలు కోదండరాం, సి.విఠల్, కత్తి వెంకటస్వామి, అద్దంకి దయాకర్, వి.శ్రీనివాస్‌గౌడ్, దేవీప్రసాద్, రాజేందర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
తెలంగాణకు మీరే అమ్మ
Published Sat, Feb 22 2014 1:44 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM
Advertisement
Advertisement