హైదరాబాద్లో 35వేల ఉద్యోగాలకు గండి
హైదరాబాద్లో 35వేల ఉద్యోగాలకు గండి
Published Mon, Sep 26 2016 3:29 PM | Last Updated on Mon, Sep 4 2017 3:05 PM
హైదరాబాద్ : భాగ్యనగరాన్ని ముంచెత్తున్న భారీ వర్షాలు రోజువారీ కూలీల జీవనాధారానికి గండికొడుతున్నాయి. ఈ వర్షాలతో 35వేలకు పైగా రోజువారీ కూలీలు రోడ్డున పడుతున్నారు. వరదలు తగ్గుముఖం పట్టి యూనిట్లను పునరుద్ధరించేంత వరకు పని ప్రారంభించమని పరిశ్రమల యాజమాన్యాలు తేల్చేయడంతో రోజువారీ వర్కర్లకు ఏం చేయాలో పాలుపోలేని పరిస్థితి ఏర్పడింది. మరో వైపు పరిశ్రమల యాజమాన్యాలకు ఈ వర్షాలు భారీ నష్టాన్నే మిగులుస్తున్నాయి. ఇప్పటికే పరిశ్రమలు రూ.1000 కోట్ల వరకు నష్టపోయి ఉంటారని ఏపీ, తెలంగాణ చాంబర్స్ వాణిజ్య పరిశ్రమల ఫెడరేషన్ అధ్యక్షుడు రవింద్ర మోదీ అంచనావేస్తున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మా యూనిట్లలో ఈ నష్టం ఎక్కువగా ఉండొచ్చన్నారు.
కుత్భులాపూర్, దులపల్లి, జీడిమెట్ల, చీర్లపల్లి, కూకట్పల్లి, బాలానగర్లో పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. ఈ పరిశ్రమలో జీవానాధారం కోసం సిటీకి వచ్చిన ఇతర రాష్ట్రాల కూలీలు వేలల్లో పనిచేస్తున్నారు. కానీ గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఈ పరిశ్రమలన్నీ ముప్పుకు గురయ్యాయి. పరిశ్రమలోని ముడిసరుకు, యంత్రాలు పాడైపోయ్యాయి. ఫ్యాక్టరీ యాజమాన్యాలు పనిని ఆపివేశాయి. దీంతో ఈ పరిశ్రమల్లో పనిచేసే బిహార్, ఒడిశా, పశ్చిమబెంగాల్ వర్కర్లు కడుపులు మాడ్చుకోవాల్సి పరిస్థితి నెలకొంది.
"ఎలక్ట్రిక్ బల్బ్ తయారీ ఫ్యాక్టరీలోపనిచేస్తున్నాను. ప్యాక్టరీకి వెళ్లి చూస్తే, వరద నీరు తగ్గే వరకు పనిచేయడానికి కుదరని పరిస్థితి నెలకొంది. రెండు నెలల వరకు ఫ్యాక్టరీ పునఃప్రారంభం కాదని కనిపిస్తోంది. దీంతో గత కొన్ని రోజులుగా చేతిలో పనిలేక తినడానికి తిండి కూడా దొరకడం లేదు" ఒడిశా నుంచి వచ్చిన ఓ వర్కర్ తన బాధను వెల్లబుచ్చుకున్నాడు. జీడిమెట్ల పరిసర ప్రాంతాల్లో చాలా పరిశ్రమలది ఇదే పరిస్థితి.
వరదలతో విద్యుత్కు అంతరాయం ఏర్పడిందని, రోడ్డు మార్గాలు పూర్తిగా దెబ్బతిన్నాయని బాలానగర్, జీడిమెట్ల ఇండస్ట్రియల్ అసోసియేషన్ మెంబర్ శ్రీరామ మూర్తి తెలిపారు. ఇంజనీరింగ్, ప్లాస్టిక్, బుల్క్ డ్రగ్స్, ఫుల్ ప్రాసెసింగ్ పరిశ్రమలు వర్షాల దెబ్బకు బాగా ప్రభావితమయ్యాయని చెప్పారు. దులపల్లి, జీడిమెట్లలోని తమ రెండు స్టోరేజ్ ఫెసిలిటీస్లో నాలుగైదు రోజుల నుంచి ఐదు అడుగుల ఎత్తులో మురుగు నీరు ప్రవహిస్తుందని పేర్కొన్నారు. 300 టన్నుల పెట్రో-కెమికల్ ఉత్పత్తులు వరద బారిన పడినట్టు ఆవేదన వ్యక్తంచేశారు.ఇప్పటికీ యూనిట్లలోకి ప్రవేశించడానికి కుదరడం లేదని ఆయుష్మాన్ మెర్చంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మనోజ్ దుగాడ్ తెలిపారు. తమకు రూ.90 లక్షల నుంచి కోటి వరకు నష్టం ఏర్పడిందన్నారు.
Advertisement