హైదరాబాద్‌లో అర్ధరాత్రి భారీ వర్షం.. ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన | Vadagalla Vana: Heavy Rain Fall In Telangana Hyderabad, Heavy Rain Forecast For These Districts, Watch Videos Inside | Sakshi
Sakshi News home page

Hyderabad Heavy Rainfall: హైదరాబాద్‌లో అర్ధరాత్రి భారీ వర్షం.. ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన

Published Sat, Mar 22 2025 7:35 AM | Last Updated on Sat, Mar 22 2025 10:49 AM

Heavy Rain Fall In Hyderabad

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో హైదరాబాద్‌ సహా పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌లలో పలుచోట్ల వడగళ్లతో భారీ వర్షం పడింది. అకాల వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్నాయి. ఇక, హైదరాబాద్‌లో శుక్రవారం రాత్రి వేళ వర్షం మొదలైంది. పటాన్ చెరు, లింగంపల్లి, మాదాపూర్, చందానగర్ తో పాటు పలు ప్రాంతాల్లో భారీ వడగాళ్ల వాన కురిసింది. దీంతో పలు కాలనీల్లో వరద నీరు చేరుకుంది.

తెలంగాణలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. శుక్రవారం సాయంత్రం ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లో సహా హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. అంతేకాకుండా… ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం రావటంతో పంట నష్టం వాటిల్లింది. అకాల వర్షం అన్నదాతలను ఆందోళనకు గురి చేసింది. గాలి వానకు మామిడికాయలు రాలిపోయాయి చేతికందే దశలో ఉన్న పంటలు దెబ్బతిన్నాయి. పలుచోట్ల వరి పంట నేలవాలింది. అకాల వర్షంతో అన్నదాతలు ఆందోళన చెందారు. మరో రెండు రోజులపాటు పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించడంతో పంటలు చేతి కందుతాయో లేదోనని ఆవేదన చెందుతున్నారు.

శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. పటాన్ చెరు, లింగంపల్లి, మాదాపూర్, చందానగర్ తో పాటు పలు ప్రాంతాల్లో భారీ వడగాళ్ల వాన కురిసింది. పలు ప్రాంతాల్లో రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. ఇక, తెలంగాణలోని కొన్నిచోట్ల నేడు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి. మిగతా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

మెదక్‌ పట్టణంలోని జంబికుంట వీధిలో ఓ ఇంటిపై పిడుగు పడింది. దీంతో సిద్ధయ్య అనే వ్యక్తి ఇంట్లో సామగ్రి ధ్వంసమైంది. ఆ సమయంలో మనుషులు ఎవరూ ఇంట్లో లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. కరీంనగర్‌లోని చొప్పదండి మార్కెట్లో మొక్కజొన్న తడిసిపోయింది. మెదక్ పట్టణం, మెదక్‌, పాపన్నపేట మండలాల్లో ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కురిసిన వర్షానికి మామిడికాయలు నేలారాలాయి. సిద్ధిపేట జిల్లాలో దుబ్బాక, మిర్దొడ్డి, తొగుట మండలాల్లో వర్షం కురిసింది.

మరోవైపు.. ఏపీలో రెండు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాల కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు, రేపు ఉరుములతో కూడిన జల్లులు ఉండే అవకాశం ఉంది. కొన్ని చోట్ల పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అనంతరం, రెండు రోజుల తర్వాత మళ్లీ ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement