చరిత్ర తెలుసుకుంటేనే భవిష్యత్
తెలంగాణ రచయితల వేదిక మహాసభల్లో కోదండరాం
కరీంనగర్ కల్చరల్: గత చరిత్ర తెలుసుకుంటేనే భవిష్యత్‌కు ప్రణాళికలు వెయ్యగలమని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. తెలంగాణ రచయితల వేదిక కరీంనగర్ జిల్లా మహాసభలు ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించారు. కోదండరాం మాట్లాడుతూ చదువుకున్నవాళ్లు మౌనంగా ఉండడం పెద్ద నేర మన్నారు. తెలంగాణ చరిత్రను తిరిగిరాస్తేనే భవిష్యత్తుకు దారి దొరుకుతుందన్నారు.
ప్రభుత్వం ప్రైవేట్ రంగానికి పెద్దపీట వేయడం వల్ల పెట్టుబడిదారులే బలపడుతున్నారన్నారు. సామాన్యుడికి వైద్యం అందించే పరిస్థితుల్లో దవాఖానాలు లేవన్నారు. అం దుకు నిదర్శనం ఉస్మానియా ఆసుపత్రేనన్నారు. సీనియర్ పాత్రికేయులు కె.శ్రీనివాస్, తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ జయధీర్ తిరుమల్‌రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష నెరవేరే దిశలో రచయితలు పనిచేయాలని ఆకాంక్షిం చారు.
వీక్షణం పత్రిక సంపాదకులు ఎన్.వేణుగోపాల్, వేదిక అఖిలభారత అధ్యక్షుడు జూకం టి జగన్నాథం, ప్రధాన కార్యదర్శి సంగెవేని రవీంద్ర, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాజోజు నాగభూషణం, కేంద్ర సాహితీ అవార్డు గ్రహీత నలిమెల భాస్కర్, కథా రచయిత అల్లం రాజయ్య, జర్నలిస్ట్స్ యూనియన్ నాయకులు నగునూరి శేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కె.శ్రీనివాస్ రాసిన ‘తెలంగాణ సాహిత్య వికాసం’ పుస్తకాన్ని శతాధిక గ్రంథకర్త మలయశ్రీ ఆవిష్కరించారు. కూకట్ల తిరుపతి రాసిన ఆరుద్ర పురుగు కవితా సంపుటిని కె.శ్రీనివాస్ ఆవిష్కరించారు.